Andy Burnham: బ్రిటన్ ప్రధాని రేసులోకి కింగ్ ఆఫ్ ది నార్త్.. ఎవరీ ఆండీ బర్న్‌హామ్! | | ACTPnews

Andy Burnham: బ్రిటన్ ప్రధాని రేసులోకి కింగ్ ఆఫ్ ది నార్త్.. ఎవరీ ఆండీ బర్న్‌హామ్! |


రాజకీయ ప్రస్థానం.. డౌనింగ్ స్ట్రీట్ వైపు అడుగులు

1970లో లివర్‌పూల్‌లో జన్మించిన బర్న్‌హామ్, ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు.

మంత్రిగా అనుభవం: 2001 నుండి 2017 వరకు లీగ్ నియోజకవర్గ ఎంపీగా పనిచేసిన ఆయన, గతంలో గోర్డాన్ బ్రౌన్ ప్రభుత్వంలో ఆరోగ్య, సాంస్కృతిక శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

మేయర్‌గా హ్యాట్రిక్: గతంలో 2010, 2015లలో లేబర్ పార్టీ నాయకత్వం కోసం పోటీ చేసి ఓడిపోయిన బర్న్‌హామ్, 2017లో లండన్ రాజకీయాలను వీడి ‘గ్రేటర్ మాంచెస్టర్’ మేయర్‌గా బరిలోకి దిగారు. అక్కడ వరుసగా మూడుసార్లు మేయర్‌గా గెలిచి రికార్డు సృష్టించారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో అప్పటి బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ ప్రభుత్వంతో ఆయన తీవ్రంగా విభేదించారు. లండన్ కేంద్రంగా సాగే బ్రిటన్ పాలన ఉత్తరాది ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తోందని గట్టిగా గళమెత్తారు. ఈ పోరాటంతోనే ఆయనకు ‘కింగ్ ఆఫ్ ద నార్త్’ అనే పేరు వచ్చింది. మేయర్‌గా ఉన్నప్పుడు మాంచెస్టర్ ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తూ ఆయన ప్రవేశపెట్టిన ‘బీ నెట్‌వర్క్’ (Bee Network) సూపర్ హిట్ అయింది.

ఆకర్షణీయమైన నాయకుడు

గడిచిన కొన్నేళ్లలో బర్న్‌హామ్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఎదిగారు. తాను లండన్ రాజకీయాలకు ‘అవుట్‌సైడర్’ (బయటి వ్యక్తిని) అని చెప్పుకునే బర్న్‌హామ్, నిజానికి 24 ఏళ్లకే పార్లమెంటరీ పరిశోధకుడిగా, 28 ఏళ్లకు ప్రత్యేక సలహాదారుడిగా, 31 ఏళ్లకే ఎంపీగా ఎదిగిన సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడు.

గతంలో లేబర్ పార్టీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నప్పుడు మేయర్‌గా ఉన్న బర్న్‌హామ్ ఆ గొడవలకు దూరంగా ఉంటూ తన ఇమేజ్‌ను కాపాడుకున్నారు. మాంచెస్టర్ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే కాకుండా, పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, 2020 నాటికి మాంచెస్టర్‌లో నిరాశ్రయుల సమస్యను పూర్తిగా నిర్మూలిస్తానన్న ఆయన హామీ నెరవేరకపోవడంపై కొంత విమర్శలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, ఒక అమెరికన్ స్టేట్ గవర్నర్ తరహాలో రీజినల్ లీడర్‌గా ఆయన దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు.

ఏంటో ఈ ‘మాంచెస్టరిజం’?

లేబర్ పార్టీ వర్గాల్లో బర్న్‌హామ్‌పై ఒక పాత జోక్ ఉంది. ఆ పార్టీలో అప్పటికప్పుడు ట్రెండ్‌లో ఉన్న సిద్ధాంతాల్లోకి ఆయన సులువుగా మారిపోగలరని అంటారు. కానీ రాజకీయ విశ్లేషకుల ప్రకారం… బర్న్‌హామ్ లేబర్ పార్టీలోని ‘సాఫ్ట్ లెఫ్ట్’ (మధ్యస్థ వామపక్ష) ధోరణికి చెందినవారు.

ఆయన మేయర్‌గా ఉన్న కాలంలో ‘మాంచెస్టరిజం’ అనే కొత్త రాజకీయ పదం తెరపైకి వచ్చింది. దీని అర్థం “వ్యాపార అనుకూల సామ్యవాదం” (Business-friendly Socialism). పెట్టుబడిదారీ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకించకుండానే… గృహనిర్మాణం, నీరు, ఇంధనం, రవాణా వంటి అత్యవసర సేవలను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంచడం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే లండన్ చేతుల్లో ఉండే అధికారాలను మిగిలిన నగరాలకు బదిలీ చేయడం, కార్మికులకు మేలు జరిగేలా పరిశ్రమలను ప్రోత్సహించడం దీని ప్రధాన సూత్రాలు.

సవాళ్ల వలయంలో లేబర్ పార్టీ

గడిచిన రెండేళ్ల పాలనలో లేబర్ పార్టీ ప్రజాదరణ క్రమంగా తగ్గుతూ రావడం, అంతర్గత కుమ్ములాటలు పెరగడంతో పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది. మరోవైపు ‘రిఫార్మ్ యూకే’ (Reform UK) పార్టీ నుంచి వస్తున్న ముప్పును తట్టుకోవడం లేబర్ పార్టీకి అత్యవసరంగా మారింది.

ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నిధుల కొరత ఉంది. ఇలాంటి సమయంలో బర్న్‌హామ్ ప్రధాని పగ్గాలు చేపడితే ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. వలసల విషయంలో కఠినంగా ఉంటే నగరాల్లోని విద్యావంతులైన ఓటర్లు దూరమవుతారు, అలాగని ఉదారంగా ఉంటే వర్కింగ్ క్లాస్ (కార్మిక వర్గం) ఓటర్లు ఆగ్రహిస్తారు.

అందుకే బర్న్‌హామ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వలసదారులకు శాశ్వత శరణార్థి హోదాను ముగించే ప్రభుత్వ నిర్ణయానికి ఆయన మద్దతు పలికారు. అలాగే గతంలో బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించి, బ్రిటన్ మళ్లీ ఐరోపా సమాఖ్య (EU)లో చేరాలన్న తన పాత వ్యాఖ్యల నుంచి ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఏదేమైనా, ‘కింగ్ ఆఫ్ ద నార్త్’ బ్రిటన్ పార్లమెంట్‌లో అడుగుపెడుతుండటంతో, ఇప్పుడు దేశం చూపు మొత్తం ఆయనపైనే ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports