CM Vijay: ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు.. సీఎం విజయ్ ఘన నివాళి | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

దిగ్గజ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పి. భారతీరాజా (84) బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించిన సీఎం విజయ్.. స్వయంగా ఆయన పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు.

News18
News18

భారత చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా కోలీవుడ్ (తమిళ చిత్రసీమ)లో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. చిత్రసీమను స్టూడియోల నాలుగు గోడల నుంచి పల్లెటూరి పచ్చని వాతావరణంలోకి నడిపించిన దిగ్గజ దర్శకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పి. భారతీరాజా (84) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర శ్వాసకోశ సంబంధిత సమస్యలు, వయోవృద్ధాప్య అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై నీలాంకరైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.

సీఎం జోసెఫ్ విజయ్ ఘన నివాళి:

భారతీరాజా మరణవార్త తెలియగానే తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే దర్శకుడి నివాసానికి చేరుకున్న సీఎం విజయ్.. భారతీరాజా పార్థివ దేహానికి పూలమాల వేసి చేతులెత్తి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తన గాఢ సానుభూతిని తెలియజేశారు. భారతీరాజా అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో (State Honours) నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సీఎం విజయ్ నివాళులర్పించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

తమిళంలో ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం)గా పిలవబడే భారతీరాజా.. 1977లో వచ్చిన ’16 వయతినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) సినిమాతో దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. అంతవరకు ఇండోర్ సెట్టింగ్స్ లో సాగే సినిమాలను కాదని, సహజమైన పల్లెటూరి వాతావరణం, మట్టి వాసనను వెండితెరకు పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్ ఆయన.

తెలుగు సినీ పరిశ్రమతో విడదీయరాని బంధం:

భారతీరాజాకు తెలుగు చిత్రసీమతోనూ ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన క్లాసిక్ ప్రేమకథా చిత్రం ‘సీతాకోకచిలుక’ (1981) తెలుగులో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికిగానూ ఆయన ఉత్తమ జాతీయ చిత్ర అవార్డుతో పాటు నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. అలాగే ‘ఆరాధన’, ‘పసలపూడి వీరబాబు’ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కార్తీక్, రాధ, రేవతి, రాధిక, విజయశాంతి వంటి ఎందరో మేటి నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.

అవార్డులు – వ్యక్తిగత జీవితం:

సినిమా రంగానికి ఆయన చేసిన అద్భుత సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2004లో భారతీరాజాను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. తన సుదీర్ఘ కెరీర్‌లో ఆయన మొత్తం 6 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకోవడమే కాకుండా, పలు ఫిలింఫేర్, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను కైవసం చేసుకున్నారు. కేవలం దర్శకుడిగానే కాకుండా.. ‘ఆయుధ ఎళుతు’, ‘తిరుచిత్రంబలమ్’, ‘మహారాజ’ వంటి చిత్రాల్లో అద్భుత నటనతో నటుడిగానూ మెప్పించారు. 1974లో చంద్రలీలను వివాహం చేసుకున్న ఆయనకు కుమార్తె జనని ఉన్నారు. ఆయన కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా 2025లో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. భారతీరాజా మరణం యావత్ భారత చలనచిత్ర రంగానికి తీరని లోటని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *