హైదరాబాద్ సినిమాల్లో చూపించినట్లుగానే అన్నీ వర్గాల ప్రజలు నివసించడానికి అనువైన నగరంగా మారింది. ఇక్కడికి పనులు, ఉపాధి, ఉద్యోగం, చదువుకునేందుకు వస్తున్న వారి సంఖ్య ఏటా రెట్టింపు అవుతూ వస్తోంది. దీనికి తోడు హైదరాబాద్‌లో అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, మల్టినేషనల్ కంపెనీలు, ప్రపంచ పేరుగాంచిన సాఫ్ట్‌పేర్ కంపెనీలు ఇక్కడకు షిప్ట్ అవడంతో నగరంలో చదువుకున్న వాళ్లు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి జాబ్, బిజినెస్, స్టడీ పేరుతో సెటిలవుతున్న వాళ్లు ఉన్నారు. అయితే ఇక్కడ సమస్య అంత చదువుకునే విద్యార్ధులు, ఉద్యోగాలు చేస్తున్న యువతి, యువకులతోనే వ్యవస్థ, సంస్కృతి పూర్తిగా చెడిపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
బాగా చదువుకొని జాబ్స్ చేస్తున్న ఒంటరి యువతి, యువకులకు హైదరాబాద్ లగ్జరీ లివింగ్ ప్లేసుగా మాత్రమే చూడటం లేదు. ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి అనువైన సిటీగా మార్చుకుంటున్నారు. వేషం, భాషతో తమ అలవాట్లను మార్చుకుంటున్న యువత సంస్కృతి, సంప్రదాయాలను పూర్తిగా విస్మరించి విలువలు, విచక్షణ కోల్పోయి జీవిస్తున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ యువత కెరియర్ పేరుతో పెద్దవాళ్లకు దూరంగా రావడమే ఇందుకు ప్రధాన కారణం అయిందని హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ ఫిజియాలజిస్ట్ శైలజా తెలిపారు. సిటీకి వచ్చిన యువతి, యువకులు తమకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లేదంటే వర్కింగ్ లొకేషన్, స్టడీ సెంటర్లలో పరిచయమైన వారు, కొలీగ్స్‌తో డీప్ రిలేషన్‌షిప్ మెయిన్‌టెన్ చేస్తూ పెళ్లికి ముందే ఒంటరి జీవితానికి స్వస్తి చెబుతూ కో-లివింగ్ పేరుతో కోరికలు తీర్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా కేసులు సైబరాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, కోకాపేట్ లాంటి హై గేటెడ్, సెమీ గేటెడ్ కమ్యూనిటీ నివసించే ప్రాంతాల్లో విపరీతంగా పెరిగిపోయాయి. జాబ్స్ చేసే వాళ్లు తమకు వచ్చే శాలరీతో జీవితాంతం ఇదే విధంగా నచ్చిన వ్యక్తితో పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోవడమే కాకుండా శరీరక కోరికలు తీర్చుకుంటూ తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తులో తలెత్తబోయే పరిణామాలు, పర్యవసానాల గురించి పట్టించుకోవడం లేదని ఫిజియాలజిస్ట్ శైలజా అంటున్నారు.
తమకు నచ్చినది చేయడానికి .. ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తుంటే ఇదేంటని అడిగే వాళ్లు పక్కనే లేకపోవడం, చేస్తున్నది తప్పూ అని మందలించే వాళ్లు, మంచి చెప్పే వాళ్లకు దూరంగా ఉండటంతో పాటు ముక్కు, ముఖం తెలియని వ్యక్తులతో ఫుడ్ అండ్ బెడ్ రిలేషన్‌షిప్ పెంచుకోవడం విష సంస్కృతికి బీజం వేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరిలో ఉన్నంత వరకు.. తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉన్నంత వరకు వాళ్లు గీసిన గీత దాటని యువతి, యువకులు.. సిటీల్లోకి వచ్చిన తర్వాత కో- లివింగ్ పేరుతో గీత దాటకుండానే అన్నీ తప్పులు చేసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి అభివృద్ది చెందుతున్న నగరంలో పక్క వాళ్లను చూసి.. వాళ్ల లైఫ్ స్టైల్‌ని రోల్ మోడల్‌గా తీసుకొని చెడిపోతున్న అమ్మాయిలు, అబ్బాయిల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందంటున్నారు. తాజాగా తన దగ్గరకు ఓ ఐటీ చదివిన యువతిని పేరెంట్స్ కౌన్సిలింగ్ కోసం తీసుకొచ్చారని .. ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్ మోజులో పడి తన సర్వస్వం అర్పించుకున్న విషయాన్ని చెప్పినట్లుగా తెలిపారు శైలజా. అయితే ఆ యువతి పేరును బయటపెట్టడం సభ్యత కాదని గోప్యంగా ఉంచారు.
యుక్తవయసులో ఉన్న అమ్మాయి, అబ్బాయిలు తమ మధ్య ఉండే శారీరక ఆకర్షణ, కోరికలు తీర్చుకోవడానికి రిలేషన్‌షిప్, లివిన రిలేషన్‌షిప్, కో- లివింగ్ పేర్లతో కలిసి ఒకే గదిలో ఉండటం, ఒక బెడ్ పై పడుకోవడం కలిసి తినడం వంటి వాటితో జీవితంలో ఇదే చాలా బాగుంది.. ఇలాగే ఉంటే తప్పేంటనే ధోరణితో మారిపోతున్నారని అంటున్నారు. ఎలాంటి సంబంధం లేకుండా ఏర్పడే బంధం కాబట్టే మధ్యలోనే బ్రేకప్ అవడం, విడిపోవడంతో అబ్బాయిలు అమ్మాయిలను ఈజీగా వదిలించుకోవడం, అమ్మాయిలు కూడా తమను అవసరానికి వాడుకుంటున్న అబ్బాయిలను శారీరక కోర్కెలు తీర్చడంతో పాటు అవసరాలు తీర్చే ఏటీఎంలుగా చూస్తున్నారని శైలజా న్యూస్18కి తెలిపారు. అయితే ఇలాంటి నీచ సంస్కృతి, విష సంప్రదాయాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి కఠిన నియమాలు లేకపోవడం, అదే విధంగా చదువుకునే సమయంలో అయినా పాఠ్య పుస్తకాల్లో టీనేజ్‌లో అమ్మాయి, అబ్బాయిలు ఎలా నడుచుకోవాలో చెప్పకపోవడం వల్లే ప్రతీ ఒక్కరూ విచ్చలవిడితనానికి అలవాటు పడి వారి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని శైలజా తెలిపారు. ఇదంతా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా మారిపోయిందని కో- లివింగ్ రిలేషన్స్‌పై తమ అభిప్రాయాన్ని చెప్పారు.
తమ పిల్లలు కెరియర్‌లో బాగా సెటిలవ్వాలని పేరెంట్స్ వాళ్లకు నచ్చినవన్ని ఇస్తూనే వాళ్ల ఇష్టానికి వదిలేయడం కూడా ఈతరహా పోకడకు ప్రధాన కారణమని అంటున్నారు నిపుణులు. తల్లిదండ్రుల అతిప్రేమ, గారాబంతో పాటు పేరెంట్స్ పర్యవేక్షణ లేకపోవడంతో బయటకు ఒంటరిగా వచ్చిన అమ్మాయి, అబ్బాయిలు తమ కోరికలను గుర్రాలుగా మార్చేసుకుంటున్నారని చెప్పారు. ఇక పవిత్రమైన వైవాహిక జీవితాన్ని కూడా భారంగా భావించడమే కాకుండా.. అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకుంటే వంటింటి కుందేలుగా మారడమే కాకుండా భర్త, అత్తమామలకు చాకిరి చేయాలనే బాధ్యతను భారంగా భావిస్తున్నారని.. అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకుంటే ఫ్రెండ్స్‌తో తిరిగే స్పేచ్చను కోల్పోవడమే కాకుండా కుటుంబాన్ని పోషించే కీలక బాధ్యతను మోయలేని భారంగా ఫీలవుతున్నారని అందుకే పెళ్లి చేసుకోకుండా నచ్చిన వ్యక్తితో గడిపేస్తూ.. లైఫ్ సింగిల్‌గానే జాలీగా ఉందని ఊహించుకుంటున్నారు. మరికొందరైతే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య ఉండే మనస్పర్దలు, చిన్న చిన్న విభేదాలను తలచుకొని మనకెందుకు ఈ తలనొప్పి అని కూడా పెళ్లి ఊసే ఎత్తడం లేదంటున్నారు. జీవితంలో దూరదృష్టి లేకపోవడం, సమస్యలు, బాధ్యతల పట్ల ఓర్పు, సహనం లేని కారణంగానే ఈవిధంగా పెళ్లికి ముందే పరాయి వ్యక్తులతో పర్సనల్ లైఫ్ షేర్ చేసుకుంటూ కష్టాల్ని చిన్న వయసులోనే కొని తెచ్చుకుంటున్నారని శైలజా న్యూస్18 ద్వారా తెలిపారు.
యుక్త వయసులో ఉండే అమ్మాయిలు, అబ్బాయిలు పరాయి వ్యక్తుల ఆకర్షణకు లోనవడానికి మొబైల్ యాప్స్, మీడియాలో వచ్చే కథనాలు, కొట్టి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉండే కొరియన్ సిరీస్, ఇతర దేశాల యాప్స్ కూడా అమ్మాయిలు, అబ్బాయిలను తప్పు దారి పట్టించడానికి కారణమవుతున్నాయి. అమ్మాయిని మోసం చేస్తే పోక్సో కేసులో చిక్కుకుంటామనే భయం అబ్బాయిల్లో కలగాలని .. ఆదిశగా ప్రభుత్వాలు, పోలీసులు కఠినంగా చట్టాలు, నిబంధనలను అమలు చేయాలంటున్నారు. ఇక యువతి కూడా తాత్కాలిక ఆనందం కోసం శారీరక కోర్కెలు తీర్చుకుంటే తర్వాత కన్సీవ్ అవ్వడం, అబార్షన్ చేయించుకుంటే సరిపోతుందని భావించే వారికి తర్వాత ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలపై కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రముఖ ఫిజియాలజిస్ట్ శైలజా తెలిపారు.అమ్మాయి, అబ్బాయిలకు ఈ లివిన్ రిలేషన్‌షిప్, కో-లివింగ్ , డేటింగ్ వంటి వాటిపై సొసైటీ సేఫ్టీ, ఎమోషనల్ సేఫ్టీ, పేరెంటల్ కేర్ ఎంతో అవసరమని సూచించారు.
పెళ్లి కాని వాళ్లు వివాహం తర్వాత తలెత్తే అంశాలను దృష్టిలో పెట్టుకొని కో-లివింగ్ పేరుతో హైదరాబాద్‌లో జంటగా జీవిస్తుంటే .. పెళ్లి చేసుకున్న వాళ్లు లైఫ్ పార్టనర్‌తో సఖ్యత లేకపోవడం, చిన్న చిన్న భేదాభిప్రాయాలతో విడాకులు తీసుకోని కొత్త వ్యక్తులతో కో- లివింగ్ రిలేషన్ బెటర్ అని భావిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇది వ్యక్తుల భవిష్యత్తుకే ప్రమాదమని సూచిస్తున్నారు.












