Last Updated:
స్వచ్ఛమైన ప్రేమకథలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ తిరుగుండదు. సరిగ్గా ఇదే నమ్మకంతో, హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక అందమైన యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘దీవానా’ (Deewana). మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా..
కథలో నిజాయితీ, పాత్రల్లో సహజత్వం ఉంటే చిన్న సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గుండెలకు హత్తుకుంటారు. ముఖ్యంగా స్వచ్ఛమైన ప్రేమకథలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ తిరుగుండదు. సరిగ్గా ఇదే నమ్మకంతో, హైదరాబాదీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక అందమైన యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘దీవానా’ (Deewana). హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ:
హైదరాబాద్‌కు చెందిన మున్నా (హర్షిత్ రెడ్డి) జీవితంలో ఎలాంటి లక్ష్యం లేని ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు. డిగ్రీ పూర్తయినా ఉద్యోగం చేయకుండా స్నేహితులతో జల్సాలు చేస్తూ తిరుగుతుంటాడు. తండ్రి శేఖర్ (నరేష్) కష్టపడుతూ కొడుకును ప్రాణంగా చూసుకుంటున్నా, మున్నాకు మాత్రం బాధ్యత తెలియదు. అలాంటి సమయంలో ఒక మీ సేవ సెంటర్‌లో పనిచేసే అమూల్య (స్మేహా మణిమేఘలై)ను చూసి మున్నా తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.
ఆమె ప్రేమను ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్న మున్నాకు అమూల్య ఒక కఠినమైన షరతు విధిస్తుంది. “నేనే నెలకు రూ. 20 వేలు సంపాదిస్తున్నాను. కనీసం అంత కూడా సంపాదించలేని నువ్వు.. ముందు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి నా ముందుకు రా, అప్పుడే ఆలోచిస్తా” అని గట్టిగా చెప్పేస్తుంది. మరి అమూల్య అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది? బాధ్యత లేని మున్నా ఆమె కోసం కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడా? చివరకు వీరి ప్రేమ కథ ఎలాంటి ముగింపునకు చేరింది? అనేదే మిగతా సినిమా.
విశ్లేషణ:
సినిమా ప్రారంభంలో సాధారణ రొటీన్ యూత్ సినిమాలా అనిపించినప్పటికీ, లవ్ ట్రాక్ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ మలుపు కథను పూర్తిగా మారుస్తుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే తండ్రి-కొడుకుల సెంటిమెంట్ దృశ్యాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. పోలీస్ స్టేషన్ సీన్లలో సీనియర్ నటుడు నరేష్ నటన, తండ్రి విలువ గురించి రఘు కారుమంచి చెప్పే డైలాగులు గుండెకు హత్తుకుంటాయి. కేవలం ప్రేమకథగానే కాకుండా, బాధ్యత, కుటుంబ విలువలను చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడని చెప్పుకోవాలి. కొన్ని చోట్ల హీరో ఒకే ప్రయత్నంలో గవర్నమెంట్ జాబ్ కొట్టడం లాంటి సీన్లలో లాజిక్స్ వెతకకుండా సినిమాటిక్ లిబర్టీగా సరిపెట్టుకోవాలి.
సాంకేతిక విభాగం, నటీనటుల ప్రతిభ:
మున్నా పాత్రలో హర్షిత్ రెడ్డి రెండు విభిన్నమైన షేడ్స్‌ను అద్భుతంగా పండించాడు. అమూల్యగా స్మేహా మణిమేఘలై తన సహజమైన నటన, అందంతో ఆకట్టుకుంది. సీనియర్ నటుడు నరేష్, ఝాన్సీ తమ అనుభవంతో ఎమోషనల్ సీన్లను నిలబెట్టారు. సాంకేతికంగా పచ్చిపులుసు వంశీ సినిమాటోగ్రఫీ హైదరాబాద్ లోకల్ లొకేషన్లను ఎంతో సహజంగా చూపించింది. ఈశ్వర్ చంద్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
ఓవరాల్‌గా చెప్పాలంటే.. ‘దీవానా’ చిత్రం నేటి యువతకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే స్వచ్ఛమైన, ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్.
రేటింగ్: 3
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jun 20, 2026 11:24 AM IST













