Dhurandhar Movie: ధురంధర్ సినిమాపై పెద్ద వివాదం.. DRDO సీక్రెట్స్ లీక్ అయ్యాయా..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఏ సాధారణ వ్యక్తో, సినిమా విమర్శకుడో కాదు. సాక్షాత్తూ దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఒక నిజమైన సైనికుడు.

News18
News18

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా అఫీషియల్ సీక్రెట్స్ చట్టం నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపణలు వచ్చాయి. వీటిని పరిశీలించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)లను ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది.

ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఏ సాధారణ వ్యక్తో, సినిమా విమర్శకుడో కాదు. సాక్షాత్తూ దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఒక నిజమైన సైనికుడు. న్యూఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్న సశాస్త్ర సీమా బల్ హెడ్ కానిస్టేబుల్ దీపక్ కుమార్ ఈ వివాదానికి తెరతీశారు. రాత్రింబవళ్లు శత్రువుల కదలికలపై నిఘా ఉంచే ఒక దేశభక్తుడిగా, ఆయన ఈ సినిమాలో చూపించిన కొన్ని సున్నితమైన సన్నివేశాలను చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే న్యాయపోరాటానికి సిద్ధమై, నేరుగా ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కి ఒక ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.

దీపక్ కుమార్ కోర్టు హాల్‌లో వినిపించిన వాదనలు వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారాన్ని భద్రపరిచే అఫీషియల్ సీక్రెట్స్ చట్టాన్ని ఈ సినిమా నేరుగా ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. భారత సాయుధ దళాలు తీవ్రవాదులను లేదా శత్రు దేశాలను మట్టుబెట్టేందుకు వాడే రహస్య ఆపరేషనల్ వ్యూహాలను సినిమాలో యథాతథంగా చూపించేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ మన సైనికుల స్టామినా పెంచేందుకు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు నిలిపేందుకు అత్యంత గోప్యంగా కొన్ని రకాల మందులు అభివృద్ధి చేస్తోందని, వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా కథలో లీక్ చేశారని పేర్కొన్నారు. సినిమాలో విలన్లు అంతం చేసే కొన్ని పాత్రలు, వారి ఆహార్యం నిజజీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్న సైనికాధికారులను, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సున్నితమైన విషయాలను సినిమా థియేటర్లలో బహిరంగంగా చూపిస్తే, శత్రు దేశాలకు మన సైనిక వ్యూహాలు సులువుగా తెలిసిపోతాయని, ఇది దేశ సమగ్రతకు పెను ప్రమాదమని ఆయన న్యాయమూర్తులకు వివరించారు.

ఈ వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా ఆలోచనలో పడింది. సినిమా వాళ్లు ఇది కేవలం కల్పిత కథ అని, ఎవరినీ ఉద్దేశించినది కాదని బుకాయించవచ్చు. కానీ, కోర్టు మాత్రం దీన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు. వినోదం కోసం తీసిన సినిమానే అయినా, అందులో చూపిస్తున్న అంశాల వల్ల సమాజంపై, దేశ భద్రతపై పడే ప్రభావాన్ని ఏమాత్రం కాదనలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. పిటిషనర్ చెప్పిన దాంట్లో ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేయలేమని కూడా వారు పేర్కొన్నారు.

అయితే.. క్లైమాక్స్‌లో కోర్టు ఒక ఆసక్తికరమైన తీర్పునిచ్చింది. ఈ సినిమాను బ్యాన్ చేస్తూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. బదులుగా సెన్సార్ బోర్డు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు బాధ్యతను అప్పగించింది. సెన్సార్ బోర్డుకు కొన్ని పక్కా మార్గదర్శకాలు ఉండాలని చెబుతూ, పిటిషనర్ లేవనెత్తిన ఆందోళనలను ఒక అధికారిక ఫిర్యాదుగా స్వీకరించాలని అధికారులను ఆదేశించింది. ప్రతి ఫ్రేమ్‌ను, ప్రతి డైలాగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. చివరికి, ఈ వివాదం సెన్సార్ బోర్డు కోర్టుకు చేరింది. రణ్‌వీర్ సింగ్ సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుందా, లేక దేశ భద్రతా కారణాల వల్ల సెన్సార్ కత్తెరకు బలైపోతుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. క్రియేటివ్ లిబర్టీ గెలుస్తుందా, లేక దేశభక్తి గెలుస్తుందా అనే ప్రశ్నకు సమాధానం సెన్సార్ బోర్డు తీసుకోబోయే తుది నిర్ణయంలోనే దాగుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *