Divorce: విడాకులు తీసుకోవాలనుకునే భర్తలకు భారీ షాక్.. ఉద్యోగం లేకపోయినా భార్యలకు అది ఇవ్వాల్సిందేన్న ఢిల్లీ కోర్టు | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

ఒక గృహ హింస కేసును (Domestic Violence Case) విచారించిన కోర్టు.. సదరు వ్యక్తి తన మైనర్ కుమారుడి కోసం ప్రతి నెలా రూ. 6,000 చెల్లించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Divorce: కేవలం తనకు ఉద్యోగం లేదనే నెపంతో ఒక భర్త.. తన భార్య, మైనర్ బిడ్డను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత నుండి తప్పించుకోలేడని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. ఒక గృహ హింస కేసును (Domestic Violence Case) విచారించిన కోర్టు.. సదరు వ్యక్తి తన మైనర్ కుమారుడి కోసం ప్రతి నెలా రూ. 6,000 చెల్లించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.  గతంలో ట్రయల్ కోర్ట్ తనకు ఎలాంటి ఆర్థిక ఉపశమనం (మొనెటరీ రిలీఫ్) కల్పించలేదంటూ ఒక మహిళ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన అడిషనల్ సెషన్స్ జడ్జి శీతల్ చౌదరి ప్రధాన్ ఈ కీలక ఉత్తర్వులను పాస్ చేశారు.

నిరుద్యోగం అనేది సాకు కానే కాదు

ఈ కేసుపై పీటీఐ కథనం ప్రకారం.. జూన్ 2న కోర్టు తన ఉత్తర్వుల్లో ఇలా పేర్కొంది: “భర్త లేదా రెస్పాండెంట్ తన సొంత ఖర్చులను ఎలా మేనేజ్ చేసుకుంటాడు అనేది అతని ఇష్టం. కేవలం తనకు ఉద్యోగం లేదనే సాకు చెప్పడం లేదా తనకు ఇతర బాధ్యతలు ఉన్నాయని అనడం ద్వారా.. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యను, మైనర్ కుమారుడిని పోషించాల్సిన బాధ్యత నుండి అతను తప్పుకోలేడు.” అని పేర్కొంది.

బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. 2013లో ఆమెకు వివాహం కాగా, ఆ తర్వాత భర్త మరియు అతని బంధువుల నుండి వరకట్న వేధింపులు, శారీరక మరియు మానసిక హింసను ఎదుర్కొంది. తాను గర్భవతిగా ఉన్న సమయంలోనే అత్తగారి ఇంటి నుండి గెంటివేశారని, 2015 నుండి తన కుమారుడిని ఒంటరిగానే పెంచుతున్నట్లు ఆమె కోర్టుకు వివరించింది.

అయితే, శారీరక హింస మరియు వేధింపులకు సంబంధించిన ఆరోపణలను రుజువు చేయడానికి సరైన వైద్య రికార్డులు లేదా ఇతర స్వతంత్ర ఆధారాలు లేవని అప్పీలేట్ కోర్టు కూడా ట్రయల్ కోర్టుతో ఏకీభవించినప్పటికీ.. సదరు తండ్రి చాలా ఏళ్లుగా తన బిడ్డకు ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదనే వాస్తవాన్ని కోర్టు గుర్తించింది. “మైనర్ బిడ్డను పోషించడంలో తండ్రికి కూడా సమానమైన బాధ్యత ఉంది” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

‘చదువుకున్నంత మాత్రాన ఆర్థికంగా స్థిరపడినట్లు కాదు’

సదరు మహిళ విద్యావంతురాలు కాబట్టి ఆమెకు భరణం నిరాకరించాలనే భర్త వాదనను కూడా న్యాయమూర్తి పూర్తిగా తోసిపుచ్చారు. “సంపాదించగల సామర్థ్యం ఉండటం వేరు.. నిజంగా సంపాదిస్తూ ఉండటం వేరు. ఈ రెండు వేర్వేరు అంశాలు” అని కోర్టు పేర్కొంది. ఆమె తనను తాను, బిడ్డను పోషించుకోగలిగేంతగా సంపాదిస్తోందని నిరూపించడానికి భర్త ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేకపోయాడు. అంతేకాకుండా, ట్రయల్ కోర్టు పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ భర్త తన ఆదాయ అఫిడవిట్‌ను దాఖలు చేయడంలో పదే పదే విఫలమయ్యాడని కోర్టు తప్పుపట్టింది.

“ఈ కేసులోని అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత, రెస్పాండెంట్/భర్త తన మైనర్ కుమారుడికి ఈ ఉత్తర్వు వచ్చిన తేదీ నుండి అతను మేజర్ (వయస్సు వచ్చే వరకు) అయ్యే వరకు ప్రతి నెలా రూ. 6,000 భరణం చెల్లించే సామర్థ్యం కలిగి ఉన్నాడని నేను భావిస్తున్నాను” అని జడ్జి శీతల్ చౌదరి ప్రధాన్ తన తీర్పులో స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *