Top 10 News: టూడే టాప్ 10 న్యూస్ అప్‌డేట్స్.. తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయం వరకు.. | | ACTPnews

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 2015 ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి సహా ముగ్గురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది, తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, తాజాగా ప్రధాన ఫిర్యాదుదారు, మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో తన వాదనలు కూడా వినాలని కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన ఫిర్యాదుదారుగా తన వాదనలు నిష్పక్షపాత విచారణకు కీలకమని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.

2.ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేస్తున్న వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని శాశ్వతం చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో పాటు కొన్ని హెచ్-సిటీ ఇన్‌ఫ్రా పనులను రద్దు చేయడంతో సుమారు రూ.400 కోట్ల ప్రజాధనం ఆదా కానుంది. వన్‌వే విధానం, ఫ్రీ లెఫ్ట్ టర్న్‌ల వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గిందని అధికారులు తెలిపారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఆరు లేన్ల స్టీల్ ఫ్లైఓవర్, కేబీఆర్ పార్క్ సమీపంలో అండర్‌పాస్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

3.లిక్కర్ స్కామ్‌పై సమాధానం చెప్పే ధైర్యం ఉందా?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి రూ.30,156 కోట్ల ‘అమరజీవి జలధార’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 90 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించనున్నట్లు హామీ ఇచ్చారు. వివేకానంద రెడ్డి హత్య కేసు, లిక్కర్ స్కామ్ అంశాలపై ప్రతిపక్ష నేతను ప్రశ్నించారు. ఈ కేసుల్లో వాస్తవాలపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు.

4.రాయలసీమ పౌరుషమంటే.. అభివృద్ధి

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాయలసీమ పౌరుషాన్ని ప్రస్తావిస్తూ, ఇది గొడవల సమయం కాదని, అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన సమయమని అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రూ.30,156 కోట్ల ‘అమరజీవి జలధార’ పథకానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను గొడవలు, ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు

5.అలా సీఈసీపై ఆదేశాలివ్వలేం..

‘సర్‌’ అంశంపై ఎన్నికల కమిషన్‌లో విభేదాల వార్తల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. కేవలం వార్తాపత్రిక కథనం ఆధారంగా ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం స్పందనను పరిశీలించిన తర్వాత, అధికారాల వినియోగంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఓట్ల తొలగింపు నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నట్లు రుజువైతే తదుపరి చర్యలు చేపడతామని పేర్కొంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో చేసిన మార్పులను తాము ఆమోదించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

6.అత్యాచార ఘటనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలపై నేరాలకు పాల్పడేవారిలో కఠిన భయం కలిగించే చర్యలు తీసుకోవాలని సూచించింది. రాత్రి వేళల్లో కూడా మహిళలు స్వేచ్ఛగా, సురక్షితంగా తిరిగే వాతావరణం కల్పించాలని పేర్కొంది. నేరాలు జరిగిన తర్వాత చర్యలకన్నా, వాటిని ముందుగానే అరికట్టడమే ముఖ్యమని స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన గ్యాంగ్‌రేప్, హత్య, లైంగిక దాడి ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, ఈ కేసులను సుమోటోగా విచారణకు స్వీకరించింది.

7.ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు!

తమిళనాడు, కేరళ మీదుగా విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల సమయంలో ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత 24 గంటల్లో అనకాపల్లిలో 4 సెం.మీ., మందసలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని వెల్లడించారు.

8.రామాయణ మూవీ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం..

బాలీవుడ్ మూవీ ‘రామాయణ’ షూటింగ్ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబై ఫిల్మ్ సిటీలోని ఒక తాత్కాలిక సెట్‌లో సోమవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పీసీఆర్ యూనిట్, వైరింగ్, ఏసీలు మరియు షూటింగ్ సామాగ్రి కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 50 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

9.ఆ వార్తలను వెనక్కి తీసుకోవాలి..

ముంబయిలో జరిగిన ఐటీ దాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. విదేశీ నిధుల మళ్లింపు ఆరోపణలను ఖండిస్తూ, తాను 20 ఏళ్ల వయసు నుంచే నిజాయతీగా పన్నులు చెల్లిస్తున్నానని తెలిపారు. వ్యక్తిగతంగా గానీ, నిర్మాణ సంస్థల తరఫున గానీ ఎలాంటి చట్టవిరుద్ధ విదేశీ లావాదేవీలు చేయలేదని పేర్కొన్నారు. తన పేరుపై బినామీ ఆస్తులు లేవని, వాస్తవాలు నిర్ధారించకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలను రకుల్ ప్రీత్ సింగ్ తప్పుబట్టారు.

10. హౌతీల గుప్పిట్లోకి కీలక ప్రాంతాలు..

యెమెన్‌లో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమయ్యాయి. ఇరాన్ మద్దతు ఉన్న హూతీలు కీలకమైన తుర్బా పట్టణాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. తైజ్, ఏడెన్ నగరాలను కలిపే రహదారిపై ఉన్న ఈ పట్టణం సైనిక పరంగా చాలా కీలకమైనది. గతంలో హూతీలు మోఖా రేవు, బాబ్ ఎల్ మండెబ్ జలసంధిని కూడా ఆక్రమించారు. అయితే హూతీలపై యెమెన్ ప్రభుత్వం ‘డాన్ ఆఫ్ యెమెన్’ పేరిట భారీ సైనిక చర్యను ప్రకటించింది. సౌదీ సంకీర్ణ దళాల మద్దతుతో ధుబాబ్ తీరప్రాంత పట్టణాన్ని, ఎయిర్‌పోర్టును ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports