DK Aruna: అమరచింతలో రాజకీయ రణరంగం.. ఎంపీ డీకే అరుణ పర్యటనలో ఉద్రిక్తత! అవమానం చేశారని ఆరోపణలు.. | | ACTPnews

News18


Last Updated:

అమరచింతలో పెద్ద చెరువు అమృత్ 2.0 పనులపై డీకే అరుణ భూమి పూజకు కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, పోలీసు బందోబస్తు, మంత్రి వాకిటి శ్రీహరిపై ఆమె తీవ్ర విమర్శలు

+

News18

వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీ పరిధిలో ఎంపీ డీకే అరుణ పర్యటన సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. ఒక పక్క రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్, మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న తోపులాటతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ 2.0 (AMRUT 2.0) పథకంలో భాగంగా అమరచింతలోని ‘పెద్ద చెరువు’ సుందరీకరణ పనులకు నిధులు మంజూరయ్యాయి. అయితే, ఈ పనులకు సంబంధించి ఇటీవల రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. కేంద్ర నిధులతో చేపడుతున్న పనులకు స్థానిక ఎంపీగా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వలేదని, ప్రోటోకాల్‌ను పూర్తిగా విస్మరించారని డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శంకుస్థాపన చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా తాను భూమి పూజ చేస్తానని ఎంపీ ప్రకటించడంతో వివాదం మొదలైంది.

గురువారం ఎంపీ డీకే అరుణ పెద్ద చెరువు వద్ద భూమి పూజ చేసేందుకు రాగా, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆమె పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఇది కాస్తా తోపులాటకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పుతుందని గమనించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల నిరసనల మధ్యనే, భారీ పోలీసు బందోబస్తు నడుమ డీకే అరుణ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు భూమి పూజ పూర్తి చేశారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అధికార పార్టీ తీరుపై, ముఖ్యంగా మంత్రి వాకిటి శ్రీహరిపై నిప్పులు చెరిగారు. ఆమె చేసిన ప్రధాన ఆరోపణలు “బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి హుందాతనం వదిలేసి అహంకారం ప్రదర్శించడం సరికాదు. కేంద్రం నిధులు ఇస్తుంటే, కనీసం సమాచారం ఇవ్వకుండా శంకుస్థాపనలు చేయడం రాజ్యాంగ విరుద్ధం.”

రాష్ట్రంలోని ప్రతి అభివృద్ధి పనిలో కేంద్ర నిధులు ఉన్నాయని, కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు అవి తమ సొంత నిధులని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదాన్ని. నేను ఎప్పుడూ ఇలాంటి నీచ సంప్రదాయాలకు తెరలేపలేదు. ఒక మహిళా ప్రజాప్రతినిధిని గౌరవించడం నేర్చుకోండి” అని మంత్రికి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోనూ కేంద్ర నిధులు ఉన్నాయని, అయితే వాటిని కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయిస్తూ అర్హులైన పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

మంత్రి శ్రీహరి కొత్తగా దాడుల సంప్రదాయాన్ని మొదలుపెట్టారని, అది ఆయన పదవికి శోభ నివ్వదని అరుణ హెచ్చరించారు. నియోజకవర్గంలో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఎంపీగా తనకు ప్రజల మద్దతు ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలు ఏవైనా సరే ఎంపీ ప్రమేయం లేకుండా నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని, ఇలాంటి తీరును సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తత అనంతరం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరిస్థితి నిలకడగా మారింది. అయినప్పటికీ, అమరచింతలో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports