Last Updated:
2004 ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్స్ లో రచ్చ చేసిన ఆరుగురు పతివ్రతలు మూవీ, ఇప్పుడు రీ రిలీజ్ కాబోతోంది. ఆ వివరాలు చూస్తే..
ఈ మధ్యకాలంలో చూస్తే టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ అయితే కనిపిస్తోంది. పాత బ్లాక్ బస్టర్ హిట్లను, కల్ట్ క్లాసిక్ సినిమాలను 4K టెక్నాలజీతో మళ్ళీ థియేటర్లలోకి తీసుకువస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోల మాస్ యాక్షన్ బ్లాక్‌బస్టర్లతో పాటు, సినీ చరిత్రలో విలక్షణమైన ముద్ర వేసిన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను కూడా రీ రిలీజ్ చేస్తుండటంతో ప్రేక్షకులలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం తెలుగు సినీ ప్రేక్షకులను తన బోల్డ్ అండ్ రియలిస్టిక్ కంటెంట్‌తో ఆశ్చర్యపరిచిన కల్ట్ క్లాసిక్ సినిమా ‘ఆరుగురు పతివ్రతలు’ (Aaruguru Pativratalu) మరోసారి బిగ్ స్క్రీన్ పైకి రావడానికి సిద్ధమైంది. అప్పట్లో ఈ చిత్రం కంటెంట్, వినూత్నమైన పోస్టర్లు థియేటర్ల వద్ద భారీ సెన్సేషన్ క్రియేట్ చేశాయి.
స్వర్గీయ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ తన సొంత నిర్మాణ సంస్థ ‘ఇ.వి.వి. సినిమా’ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమిది. 2004 ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇప్పుడు సరిగ్గా 22 ఏళ్ల తర్వాత నేటి తరం ప్రేక్షకులను అలరించేందుకు మళ్లీ ముస్తాబైంది. పోచమ్మ ఫిల్మ్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించారు.
ఆరుగురు చిన్ననాటి స్నేహితురాళ్ళు ప్రస్తుతం తమ వైవాహిక జీవితాల్లో ఎదుర్కొంటున్న అనుభవాలను, భర్తల అసలు నైజాలను, సంసారంలో ఎదురవుతోన్న ఆటుపోట్లను ఒకరితో ఒకరు పంచుకోవడం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. పెళ్లి వ్యవస్థ, అందులో మహిళలు పడే మానసిక సంఘర్షణలు, భర్తల అనుమానాలు, నిర్లక్ష్య వైఖరి వల్ల కాపురాల్లో వచ్చే విపరిణామాలను దర్శకుడు ఈవీవీ అత్యంత సహజంగా, సమాజానికి అద్దం పట్టేలా తెరకెక్కించారు. సమాజంలో వివాహాల పేరిట సాగే మోసాలు, భార్యాభర్తల మధ్య తలెత్తే ఈగోలను సున్నితమైన వినోదంతో మేళవించి హాస్యభరితంగా చూపించిన విధానం అప్పట్లో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.
నేటి ఆధునిక కాలంలోనూ దాంపత్య జీవితాల్లో కనిపించే సమస్యలను, మానవ సంబంధాల లోతులను ఇరవై ఏళ్ల క్రితమే దర్శకుడు ముందుచూపుతో ఆవిష్కరించారు. అందుకే ఇప్పటి జెన్-జీ (Gen-Z) యువతకు సైతం ఈ సినిమా కంటెంట్ సులభంగా కనెక్ట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పాత తరం జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, నేటి ఆడియన్స్‌కు విభిన్న అనుభూతిని పంచడానికి వస్తున్న ఈ ‘ఆరుగురు పతివ్రతలు’ అక్టోబర్ 29న థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.














