Last Updated:
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్ర యూనిట్‌లో తీవ్ర కలకలం రేగింది. ఇందుకు సంబంధించిన వివరాలు చూద్దాం.
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్ర యూనిట్‌లో తీవ్ర కలకలం రేగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది. అయితే, బుధవారం షూటింగ్ ముగిసిన అనంతరం ఒక ఊహించని విషాదకర సంఘటన చోటుచేసుకుందని సమాచారం. బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ షూటింగ్ పూర్తి చేసుకుని సెట్స్‌లోని టెక్నీషియన్లతో మాట్లాడుతుండగా, ఆయన కుడికాలి పాదంపై ఒక విషపూరితమైన పురుగు కుట్టింది. తొలుత అది సాధారణ కీటకమేనని భావించిన రాజేష్ శర్మ తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కానీ, దాదాపు ఆరు గంటల తర్వాత ఆయనకు విపరీతమైన నొప్పులు, తీవ్రమైన జ్వరం రావడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి అత్యవసరంగా కోల్‌కతాకు బయలుదేరారు.
కోల్‌కతా ప్రయాణంలో విమానంలో ఉండగానే రాజేష్ శర్మ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆయన బాడీలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోవడంతో పాటు శ్వాస తీసుకోవడం కూడా అత్యంత కష్టంగా మారింది. దీంతో కోల్‌కతా చేరుకోగానే ఆయన్ను అక్కడి ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగం (ICU)లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. విషపురుగు కుట్టిన కుడి కాలు పాదం నుండి మోకాలి వరకు ఇన్‌ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపించిందని, ప్రభావిత ప్రాంతంలో పెద్ద బొబ్బలు కూడా ఏర్పడ్డాయని వైద్యులు తెలిపారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని, ఒకవేళ ఆ గడ్డ ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాపాయం ఉండే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంలో ఒక ఊహించని మలుపు చోటుచేసుకుంది. రాజేష్ శర్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆయన అసిస్టెంట్ సుభాశిష్ పాండా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ.. “రాజేష్ శర్మ కేవలం సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగా, తన డయాబెటిస్ పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లు అన్ని పరీక్షలు నిర్వహించారు, గురువారం ఉదయం ఆయన్ను డిశ్చార్జ్ చేస్తారు” అని తెలిపారు.
వైద్యుల హెల్త్ బులెటిన్‌కు, అసిస్టెంట్ ప్రకటనకు అస్సలు పొంతన లేకపోవడంతో ప్రభాస్ అభిమానులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ మీడియా వర్గాలు తీవ్ర అయోమయంలో పడిపోయాయి. ఇందులో ఏది నిజం ఏది అబద్దం అని తేల్చుకోలేకపోతున్నారు జనం.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













