Gun Fire: నెత్తురోడిన సౌతాఫ్రికా వీధులు.. విచక్షణారహితంగా కాల్పులు.. 27 మంది దుర్మరణం! | | ACTPnews

సౌతాఫ్రికాలో కాల్పుల కలకలం


Last Updated:

Gun Fire: దక్షిణాఫ్రికాలో గన్ కల్చర్ మరోసారి పడగవిప్పింది. వరుసగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు సామూహిక కాల్పుల ఘటనలతో ఆ దేశం ఉలిక్కిపడింది.

సౌతాఫ్రికాలో కాల్పుల కలకలం
సౌతాఫ్రికాలో కాల్పుల కలకలం

జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ నగరాల సమీపంలోని టౌన్‌షిప్‌లలో దుండగులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రక్తపాతంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ఏకే-47లతో మారణహోమం

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జోహన్నెస్‌బర్గ్‌ సమీపంలోని వెడెలా టౌన్‌షిప్‌లో ఉన్న ఒక బార్‌లో శనివారం రాత్రి జనం సందడిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఏకే-47 రైఫిళ్లు, అత్యాధునిక పిస్టళ్లతో ఆయుధాలు ధరించిన ఎనిమిది మంది దుండగులు ఒక్కసారిగా బార్‌లోకి చొరబడ్డారు. అక్కడున్న వారిపై ఎలాంటి కనికరం లేకుండా విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఘటనా స్థలంలోనే 17 మంది కుప్పకూలి మృతిచెందారు. మరో 15 మంది తీవ్ర గాయాలపాలవడంతో వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల శబ్దాలతో ఆ ప్రాంతమంతా భీతావాహ వాతావరణం నెలకొంది.

కేప్‌టౌన్‌లో దుకాణంపై కాల్పులు.. పది మంది బలి

ఈ దారుణం మరువకముందే, ఆదివారం తెల్లవారుజామున కేప్‌టౌన్ సమీపంలోని ల్యాండ్లే ప్రాంతంలో మరో కాల్పుల ఘటన వెలుగుచూసింది. అక్కడ ఉన్న ఒక దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు సాయుధులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

వరుస ఘటనలు.. మిన్నంటిన ఆందోళన

ఈ రెండు ఘోర సంఘటనలు జరగడానికి కొద్ది రోజుల ముందే డర్బన్ సమీపంలో ఒక ఇంట్లో జరిగిన ప్రైవేట్ పార్టీపై ముగ్గురు దుండగులు దాడి చేసి కాల్పులు జరిపిన విషయం విదితమే. ఆ ఘటనలో ఒక గర్భిణితో సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా వరుసగా జరుగుతున్న కాల్పుల ఉదంతాలతో దక్షిణాఫ్రికాలోని పలు టౌన్‌షిప్‌లలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ ఘటనలకు పాల్పడిన నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం. వరుస హింసాత్మక ఘటనలతో శాంతిభద్రతల పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports