Last Updated:
UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కాల్సిందేనని రష్యా మరోసారి స్పష్టం చేసింది.
ఈ అంతర్జాతీయ అత్యున్నత వేదికలో పాశ్చాత్య దేశాలకు అదనపు స్థానాలు కేటాయించడాన్ని తాము అంగీకరించబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తేల్చిచెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో శనివారం ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ వేదికలో సంస్కరణలు చేపడితే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని గళమెత్తారు.
భద్రతా మండలి విస్తరణ జరిగితే అది ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాలపైనే దృష్టి పెట్టాలని, అంతేగానీ పశ్చిమ దేశాలకు మరిన్ని శాశ్వత సభ్యత్వాలు ఇవ్వకూడదని లావ్రోవ్ పేర్కొన్నారు. “యూఎన్ భద్రతా మండలి సంస్కరణల పేరిట పశ్చిమ దేశాలకు, ప్రత్యేకించి జర్మనీ, జపాన్‌లకు అదనపు స్థానాలు కేటాయించడం సమంజసం కాదు. మేము ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ప్రాంతాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి అనుకూలం. శాశ్వత సభ్యత్వం కోసం బ్రెజిల్, భారత్ అభ్యర్థిత్వాలకు రష్యా పూర్తి మద్దతు ఇస్తుంది” అని లావ్రోవ్ స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భద్రతా మండలి సంస్కరణలను చేపట్టాలని భారత్ ఎప్పటినుంచో బలంగా కోరుతుండగా, రష్యా మొదటినుంచీ భారత్ ప్రయత్నాలకు నిలకడగా అండగా నిలుస్తోంది.
ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలిలో సమగ్ర మార్పులు రావాలనే డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో, భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని పోర్చుగల్, మారిషస్ దేశాలు సైతం గట్టి మద్దతు ప్రకటించాయి. మండలిలో విస్తృత ప్రాతినిధ్యం ఉండాలని పోర్చుగల్ ప్రధాని లూయిస్ మోంటెనెగ్రో పిలుపునిస్తూ భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని సమర్థించారు. అటు మారిషస్ విదేశాంగ మంత్రి ధనంజయ్ రామ్‌ఫుల్ కూడా ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రసంగిస్తూ, అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ చేస్తున్న నిర్మాణాత్మక కృషిని కొనియాడారు.
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీటో అధికారం కలిగిన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ అనే 5 దేశాలు శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. వీటితో పాటు రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికయ్యే 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. భద్రతా మండలి కూర్పును సంస్కరించి విస్తరించాలంటే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీతో ఆమోదం పొందాలి. ఆ తర్వాత ఐదు శాశ్వత సభ్య దేశాలతో కలిపి మొత్తం యూఎన్ సభ్య దేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు దీన్ని ఆమోదించాల్సి (ర్యాటిఫై) ఉంటుంది.














