Gyanesh Kumar: ఎన్నికల సంఘానికి అండగా 42 మంది మాజీ న్యాయమూర్తులు.. విపక్షాల ఆరోపణలపై ఆగ్రహం.. బహిరంగ లేఖ విడుదల! | | ACTPnews

News18


Last Updated:

ఓటర్ల జాబితాల సవరణపై విపక్షాలు సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తున్న వేళ, 42 మంది మాజీ న్యాయమూర్తులు కేంద్ర ఎన్నికల సంఘానికి బహిరంగ లేఖ ద్వారా గట్టి మద్దతు ప్రకటించారు. రాజ్యాంగ సంస్థలను కించపరచవద్దని హెచ్చరించారు.

News18
News18

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వ్యవహారంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేసిన వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా 42 మంది మాజీ న్యాయమూర్తులు, విశ్రాంత రాజ్యాంగ నిపుణులు కేంద్ర ఎన్నికల సంఘానికి అండగా నిలిచారు. అక్టోబర్ 7న ఒక ఘాటైన బహిరంగ లేఖ విడుదల చేస్తూ, రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న నిరంతర దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను విమర్శించే హక్కు అందరికీ ఉంటుందని, అయితే వ్యక్తిగత దూషణలు చేయడం, వాటిని కించపరచడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేశారు.

బహిరంగ వేదికలపై ఎన్నికల అధికారులను ‘దొంగలు’, ‘కీలుబొమ్మలు’ అంటూ సంబోధించడం వ్యవస్థలను బలహీనపరచడమేనని తేల్చిచెప్పారు. కోర్టుల్లో ఆధారాలు సమర్పించకుండా కేవలం ప్రెస్‌మీట్లలో ఓట్ల దొంగతనం అంటూ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని లేఖలో తప్పుబట్టారు.

ఓటర్ల జాబితా సవరణ చట్టబద్ధమే

ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 21(3) ప్రకారం ఓటర్ల జాబితాలను సవరించే పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉందని మాజీ న్యాయమూర్తులు స్పష్టం చేశారు. చనిపోయిన వారి పేర్లు, డూప్లికేట్ ఎంట్రీలు, నివాసాలు మారిన వారి పేర్లను తొలగించడానికే ఈ ప్రక్రియ చేపట్టారని గుర్తుచేశారు. ఈ విధానం చట్టబద్ధమైనదని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలను లక్ష్యంగా చేసుకోవడం, గెలిచినప్పుడు మాత్రం మౌనంగా ఉండటం సరైన పద్ధతి కాదని ఎత్తిచూపారు.

ప్రజాస్వామ్యానికి ప్రజల నమ్మకమే ప్రధాన బలమని లేఖలో హెచ్చరించారు. ఓట్లకు విలువ లేదనే భావన ప్రజల్లో కలిగిస్తే అది రోడ్లపై అరాచకాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల సంఘం వద్ద లేదా కోర్టుల ముందు సాక్ష్యాలతో తేల్చుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి తప్ప, ఎన్నికల ప్రక్రియనే తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు.

మీడియా కూడా ధ్రువీకరించని ఆరోపణలను విస్తృతంగా ప్రచారం చేయవద్దని కోరారు. ఒక హెడ్‌లైన్ అనేది సాక్ష్యం కాదని, పదే పదే చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కాబోదని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలు ఏ ఒక్క ప్రభుత్వానికో చెందినవి కావని, అవి భారత ప్రజల ఉమ్మడి ఆస్తులని స్పష్టం చేస్తూ లేఖను ముగించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports