H1B Visa: అమెరికా కలలకు భారీ బ్రేక్.. హెచ్‌1బీపై ట్రంప్ సర్కార్ కొరడా! భారతీయులకు షాక్ | | ACTPnews

ఫైల్ ఫోటో


Last Updated:

H1B Visa: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ టెక్ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

హెచ్‌1బీ వీసా దరఖాస్తులపై గతంలో విధించిన లక్ష డాలర్ల (దాదాపు రూ. 83 లక్షలకు పైగా) భారీ ఫీజు నిబంధనను మరో ఏడాదిపాటు పొడిగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2026 నాటి ఈ నిబంధన గడువు ఈ నెలతో ముగియనుండటంతో, ట్రంప్ సర్కార్ దీనిని కొనసాగిస్తూ తాజా ఆదేశాలు వెలువరించింది. ఈ నిర్ణయం కారణంగా ఇప్పటికే ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీల నుంచి హెచ్‌1బీ దరఖాస్తులు ఏకంగా 92 శాతం మేర పడిపోయాయని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.

అమెరికన్ల ఉద్యోగ రక్షణే లక్ష్యం

హెచ్‌1బీ వీసా నిబంధనల పొడిగింపును సమర్థిస్తూ అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. “హెచ్‌1బీ వీసాలపై ఉన్న ఉత్తర్వులను పొడిగించడం ద్వారా అమెరికా జాతీయ భద్రతతో పాటు ఆర్థిక ప్రయోజనాలను సంరక్షించుకోగలుగుతాం. దీనివల్ల స్థానిక అమెరికన్లకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా, విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకునేటప్పుడు కంపెనీలు కేవలం అత్యంత ప్రతిభావంతులు, నిపుణులైన వారిని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం కలుగుతుంది” అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికన్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక శ్రామిక శక్తికి ప్రాధాన్యత కల్పించాలనేది తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

భారతీయులపైనే ప్రభావం

ప్రతి ఏటా అమెరికా జారీ చేసే హెచ్‌1బీ వీసాల్లో సింహభాగం పొందేది భారతీయ ఇంజనీర్లు, ఐటీ నిపుణులే. అందువల్ల ఈ తాజా నిర్ణయం భారతీయ వర్క్‌ఫోర్స్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే, ఈ నిబంధనల నుంచి విద్యార్థి వీసాలపై ఇప్పటికే అమెరికాలో ఉంటూ చదువు పూర్తి చేసుకుంటున్న వారికి మినహాయింపునిచ్చారు. వారు ఈ లక్ష డాలర్ల ఫీజు పరిధిలోకి రారు. కానీ, భారతదేశం వంటి విదేశాల నుంచి నేరుగా హెచ్‌1బీ కోసం దరఖాస్తు చేసుకునే కొత్త అభ్యర్థులు, అవుట్‌సోర్సింగ్ సంస్థల ఉద్యోగులు మాత్రమే కంపెనీల తరఫున ఈ భారీ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, గత ఏడాది ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ లక్ష డాలర్ల ఫీజు అమలుపై ఇప్పటికే రెండు యూఎస్ ఫెడరల్ కోర్టుల్లో న్యాయపరమైన వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి.

మరింత కఠినంగా పరిశీలన

ప్రక్రియవీసా దరఖాస్తులను ఆమోదించే విధానాన్ని మరింత పకడ్బందీగా, కఠినంగా మార్చాలని ట్రంప్ ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశించారు. అమెరికా విదేశాంగ శాఖ, కార్మిక శాఖ, హోంల్యాండ్ భద్రతా శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. హెచ్‌1బీ దరఖాస్తులను పరిశీలించే సమయంలో.. ఆయా కంపెనీలు ఇటీవలి కాలంలో అమెరికన్ ఉద్యోగులను ఎవరినైనా తొలగించాయా లేదా అనే అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించి వారి స్థానంలో విదేశీయులను నియమించే ప్రమాదం ఉన్న చోట దరఖాస్తులను అత్యంత క్షుణ్ణంగా సమీక్షించేందుకు ఈ నిర్ణయం వీలు కల్పిస్తుందని వైట్‌హౌస్ ఫ్యాక్ట్‌షీట్ పేర్కొంది.

టెక్ వర్గాల్లో మిశ్రమ స్పందన

ఈ నిర్ణయంపై అమెరికాలోని భారతీయ ప్రవాస సంఘాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. హెచ్‌1బీ వీసా వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు దరఖాస్తుల పరిశీలనను కఠినతరం చేయడాన్ని ‘ద ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్’ (FIIDS) స్వాగతించింది. అయితే, అధిక ఫీజులు, అతి నియంత్రణల వల్ల అమెరికా సాంకేతిక ఆవిష్కరణల రంగానికి తీరని విఘాతం కలుగుతుందని హెచ్చరించింది. అమెరికాలో కొన్ని ప్రత్యేక రంగాల్లో అవసరమైన అత్యున్నత స్థాయి నిపుణులు స్థానికంగా వెంటనే లభించకపోవచ్చని, అలాంటి పరిస్థితుల్లో విదేశీ నిపుణులపై ఆధారపడటం అనివార్యమని ఎఫ్ఐఐడీఎస్ అభిప్రాయపడింది. లక్ష డాలర్ల ఫీజు భారం కారణంగా చిన్న, మధ్యతరహా స్టార్టప్‌లు ప్రతిభావంతులను నియమించుకోవడంలో వెనుకబడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports