Last Updated:
కేవలం రూ. 2 కోట్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, హిందీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన హనుమాన్ అంశ్ మూవీ నేడు తెలుగులో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా..
కేవలం రూ. 2 కోట్ల చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి, హిందీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 430 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సాక్షాత్తూ హనుమంతుని అవతారంగా భక్తులు కొలిచే ‘నీమ్ కరోలీ బాబా’ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ డివైన్ ఎమోషనల్ డ్రామా ఈ రోజు (అక్టోబర్ 9) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాక్టర్ విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆధ్యాత్మిక ప్రయాణంలోకి తీసుకువెళుతుందని చెప్పొచ్చు.
భారతదేశానికి స్వాతంత్య్రం రాక మునుపు జరిగే కథాంశంతో ఈ సినిమా ప్రారంభమవుతుంది. దేవుడంటే ఏమాత్రం విశ్వాసం లేని నాస్తికుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన డాక్టర్ రామ్ నందన్ భోంస్లే (చందన్ ఆనంద్) జీవితంలో చోటుచేసుకునే కొన్ని అనూహ్య సంఘటనలు ఆయన సిద్ధాంతాలను ఎలా మార్చేశాయనేది ఇందులో ఆసక్తికరం. ఇదే క్రమంలో అతనికి లక్ష్మీనారాయణ శర్మ (శోభినవ్ సత్య)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ లక్ష్మీనారాయణ శర్మే కాలక్రమంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను సంపాదించుకున్న ‘నీమ్ కరోలీ బాబా’గా ఎలా మారారు? ఆయన సాగించిన ప్రయాణంలో ఎందరి జీవితాల్లో వెలుగులు నింపారు అనేది ఈ సినిమా కథ.
దర్శకుడు విశాల్ చతుర్వేది ఎలాంటి కమర్షియల్, రాజకీయ అజెండాలు లేకుండా కేవలం బాబా నిస్వార్థ కరుణ, ఆయన చేసిన అద్భుతాల చుట్టే కథను నడిపించిన తీరు ప్రశంసనీయం. బాబా పాత్రలో నటుడు శోభినవ్ సత్య ఒదిగిపోయారు. ఆయన ప్రదర్శించిన హుందాతనం, సహజత్వం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా రైలులో బ్రిటిష్ అధికారితో జరిగే సంభాషణ, అండర్‌గ్రౌండ్ టన్నెల్లో శివుని ప్రతిరూపం కనిపించే దృశ్యం, అలాగే అద్భుతమైన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం 2 కోట్ల బడ్జెట్ అయినప్పటికీ ప్రొడక్షన్ డిజైన్ పాత కాలాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరించింది.
అయితే, నేటి వేగవంతమైన సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఈ చిత్ర కథనం నెమ్మదిగా సాగినట్లు అనిపించవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపించడం ఆడియన్స్ సహనానికి పరీక్ష అవుతాయి. నీమ్ కరోలీ బాబా గురించి ముందుగా తెలిసిన వారికి ఈ కథ మరింతగా కనెక్ట్ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ, మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఇలాంటి నిజాయితీ గల ఆధ్యాత్మిక చిత్రం చూడాలనుకుంటే కుటుంబ సమేతంగా థియేటర్లలో చూడొచ్చు.
చివరి మాట.. నరనరాన రామ భక్తి ఉన్న వారికి ఈ హనుమాన్ అంశ్ కన్నుల పండగే, కానీ అన్ని వర్గాల ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే సినిమా అయితే కాదు.
రేటింగ్: 2.5














