Hyderabad: డేంజర్ బెల్స్.. మే నెలాఖరు వరకు తాగునీటి గండం.. తెలంగాణలో ముంచుకొస్తున్న తీవ్ర జల సంక్షోభం! | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Hyderabad: రాష్ట్రంలో వర్షాకాలం ముఖం చాటేయడంతో తీవ్ర నీటి సంక్షోభం ముంచుకొస్తోంది. ప్రస్తుత సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఒక్క ప్రధాన జలాశయమూ పూర్తిగా నిండలేదు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

చెరువులు, కుంటలు అలుగులు పారకపోవడంతో భూగర్భ జలాలు రీఛార్జ్ కాక మరింత అడుగంటిపోతున్నాయి. గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే రాష్ట్రంలో సగటు భూగర్భ జలమట్టం ఏకంగా 3.11 మీటర్ల లోతుకు పడిపోయింది. 2025 సెప్టెంబరులో 4.41 మీటర్ల వద్ద ఉన్న భూగర్భ నీటి మట్టం, ప్రస్తుత సెప్టెంబరు నాటికి 7.52 మీటర్ల లోతుకు దిగజారి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోందని రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ కె.లక్ష్మా వెల్లడించారు.

సాధారణంగా మే నెలలో ఎండ తీవ్రత, అధిక వినియోగం వల్ల భూగర్భ జలాలు లోతుకు చేరడం సహజం. ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర సగటు జలమట్టం 7.87 మీటర్ల వద్ద నమోదైంది. అయితే నైరుతి రుతుపవనాల కాలమైన జూన్ నుంచి సెప్టెంబరు వరకు కురిసే వర్షాలతో నేల రీఛార్జ్ కావాల్సి ఉన్నా, ఎల్ నినో ప్రభావం వల్ల ఆశించిన వర్షాలు పడలేదు. అధిక ఉష్ణోగ్రతల వల్ల నీటి ఆవిరి నష్టాలు కూడా తోడయ్యాయి. ఇకపై పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో, అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు తాగునీటి కొరత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. హైదరాబాద్ జిల్లాలో నిరుడు సెప్టెంబరులో 3.57 మీటర్లుగా ఉన్న నీటి మట్టం, ఈసారి ఏకంగా 6.44 మీటర్లు పడిపోయి 10.01 మీటర్ల లోతుకు చేరింది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 11.96 మీటర్లకు, మేడ్చల్-మల్కాజిగిరిలో 11.64 మీటర్లకు, రంగారెడ్డి జిల్లాలో 11.74 మీటర్లకు, సంగారెడ్డిలో 11.21 మీటర్లకు భూగర్భ జలాలు దిగజారాయి. దీంతో బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలలో సైతం బోర్లు వట్టిపోయి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

రాష్ట్ర సగటు లోటు వర్షపాతం 18 శాతంగా నమోదు కాగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ సహా మొత్తం 19 జిల్లాల్లో తీవ్రమైన వర్షపాత లోటు నమోదైంది. మరోవైపు పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ, అత్యధిక ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రజలందరూ బాధ్యతగా నీటిని పొదుపు చేయాలని, వృథాను పూర్తిగా అరికట్టాలని భూగర్భ జలవనరుల శాఖ పిలుపునిచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports