Hyderabad: పనిమనిషే హంతకురాలు.. విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్యలో నమ్మలేని నిజాలు | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

వృద్ధురాలైన తల్లికి సేవలు చేసేందుకు కల్పన అనే నేపాలీ మహిళను పనిలో పెట్టుకున్నారు. కొద్దికాలంలోనే ఇంటి సభ్యుల నమ్మకాన్ని గెలుచుకున్న కల్పన, వారి ఇంట్లోనే ఒక గదిలో ఉండేది. అయితే, ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆమె భారీ దోపిడీకి పథకం రచించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: నగరంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రశాసన్ నగర్‌లో కలకలం రేగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ వినయ్ రంజన్ రే భార్య తనూజ (60) తన నివాసంలోనే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానిక నివాసితులను మరియు పోలీసు వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

పథకం ప్రకారం ఘాతుకం

ఈనాడు కథనం ప్రకారం.. 1986 బ్యాచ్‌కు చెందిన వినయ్ రంజన్ రే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక హోదాల్లో పనిచేసి 2019లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయన తన భార్య తనూజ మరియు ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రశాసన్ నగర్‌లో నివసిస్తున్నారు. ఏడాది క్రితం తన వృద్ధురాలైన తల్లికి సేవలు చేసేందుకు కల్పన అనే నేపాలీ మహిళను పనిలో పెట్టుకున్నారు. కొద్దికాలంలోనే ఇంటి సభ్యుల నమ్మకాన్ని గెలుచుకున్న కల్పన, వారి ఇంట్లోనే ఒక గదిలో ఉండేది. అయితే, ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఆమె భారీ దోపిడీకి పథకం రచించింది.

అదును చూసి అటాక్

కొద్దిరోజుల క్రితం వినయ్ రంజన్ రే ప్రకృతి వైద్య చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లారు. ఇంట్లో యజమాని లేని సమయాన్ని గమనించిన కల్పన, తన ఇద్దరు అనుచరులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. గురువారం రాత్రి ఇద్దరు యువకులను పిలిపించి ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించిన కల్పన, అర్ధరాత్రి 1:00 నుండి 1:30 గంటల సమయంలో వారిని లోపలికి రప్పించింది. ప్రధాన ద్వారం గుండా వస్తే సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోతామనే భయంతో, ఇంటి పక్కనే ఉన్న పార్కు వైపు గేటు ద్వారా నిందితులను లోపలికి తీసుకువచ్చింది.

విగతజీవిగా మారిన తనూజ

నిందితులు ముగ్గురూ కలిసి తనూజ ఉన్న బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించారు. నిద్రలో ఉన్న ఆమె అలికిడికి మేల్కొనడంతో, నిందితులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. ఆమె అరవకుండా ఉండేందుకు నోట్లో వస్త్రాలు కుక్కి, చేతులను తాడుతో కట్టేశారు. ఆపై ఇంట్లోని నగదు, నగలను బ్యాగుల్లో సర్దుకుని పారిపోయారు. నోట్లో వస్త్రాలు గట్టిగా కుక్కడంతో ఊపిరి ఆడక తనూజ అపస్మారక స్థితికి చేరుకుని, చివరికి ప్రాణాలు విడిచారు. నిందితులు పారిపోయే క్రమంలో ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారేశారు.

పోలీసుల దర్యాప్తు

శుక్రవారం ఉదయం తనూజ ఎంతకీ నిద్రలేవకపోవడంతో ఆందోళన చెందిన కుమార్తె గదిలోకి వెళ్లి చూడగా, ఆమె విగతజీవిగా పడి ఉండటం గమనించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా, నిందితులు జర్నలిస్ట్ కాలనీ వైపు గోడ దూకి పారిపోయినట్లు గుర్తించారు. ప్రధాన నిందితురాలు కల్పనతో పాటు ఆమె అనుచరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నగరం నడిబొడ్డున, హై-ప్రొఫైల్ జోన్‌లో జరిగిన ఈ హత్య పౌరుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *