Last Updated:
ఇన్‌స్టాగ్రామ్ నకిలీ తుపాకులతో (Fake Guns) రీల్స్ చేస్తూ, ఆ ముఠా దృష్టిని ఆకర్షించి, వారి ద్వారా నిజమైన ఆయుధాలను (Weapons) సేకరించేందుకు ఇతడు ప్రయత్నాలు సాగించాడు.
Hyderabad: మేడ్చల్‌లో ఐఎస్ఐ కలకలకం.. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ISI) మద్దతు ఉన్న ఒక నేర ముఠాతో సంబంధాలు కలిగి ఉండి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై హైదరాబాద్‌లో ఒక యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పాకిస్థాన్‌కు చెందిన ముఠాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆయుధాలను సేకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజియాబాద్‌కు చెందిన జయీద్ ఖాన్ (22) అనే యువకుడు గత కొంతకాలంగా మేడ్చల్‌లోని ‘ముబారక్ హోటల్ (రెస్టారెంట్)’లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే, ఇతనికి సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్ ఐఎస్‌ఐ మద్దతున్న ఒక అంతర్జాతీయ నేర ముఠాతో పరిచయం ఏర్పడింది. ఆ దేశ వ్యతిరేక ముఠా కార్యకలాపాలపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, జయీద్ ఖాన్ వారితో కలిసి పనిచేసేందుకు తీవ్ర ఆసక్తి చూపించాడు.
నిందితుడు జయీద్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వేదికలుగా పాకిస్థాన్‌లోని సదరు ముఠా సభ్యులతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ఇన్స్టాగ్రామ్‌లో నకిలీ తుపాకులతో (Fake Guns) రీల్స్ చేస్తూ, ఆ ముఠా దృష్టిని ఆకర్షించి, వారి ద్వారా నిజమైన ఆయుధాలను (Weapons) సేకరించేందుకు ఇతడు ప్రయత్నాలు సాగించాడు.
నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన మేడ్చల్ పోలీసులు ముబారక్ హోటల్‌పై దాడి చేసి జయీద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాక్షుల సమక్షంలో అతని నుంచి రెండు నకిలీ పిస్టళ్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను నిశితంగా పరిశీలించగా.. అందులో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, దేశ వ్యతిరేక ముఠాలతో జరిపిన వాట్సాప్ చాట్లు, వాయిస్ కాల్ రికార్డులు, స్క్రీన్‌షాట్లు లభ్యమయ్యాయి. వీటిని దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలుగా సేకరించాయి.
ఈ కేసులో జయీద్ ఖాన్ వెనుక ఉన్న ఇతర వ్యక్తులు ఎవరు? తెలుగు రాష్ట్రాల్లో లేదా దేశంలో ఎక్కడైనా విధ్వంసకర చర్యలకు వీరు వ్యూహం రచించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.
Hyderabad,Telangana













