Last Updated:
రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని, దీని వల్ల ప్రాజెక్టు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ప్రస్తుత రుణ భారం తగ్గడంతో పాటు భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలకు ఇది దోహదపడుతుందన్నారు.
Hyderabad: హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) ద్వారా గరిష్ఠంగా రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ కింద రుణం పొందింది. ఢిల్లీ లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్)లిమిటెడ్, హెచ్ఎమ్ఆర్ఎల్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎఫ్సీ సీఎండీ & సీఈఓ శ్రీ మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో సమర్థవంతమైన, సుస్థిరమైన, ప్రజానుకూల ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, నగర వేగవంతమైన అభివృద్ధికి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యంత అవసరమని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని, దీని వల్ల ప్రాజెక్టు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ప్రస్తుత రుణ భారం తగ్గడంతో పాటు భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలకు ఇది దోహదపడుతుందన్నారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ బృందం, హెచ్ఎంఆర్ఎల్, సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రూ.13,600 కోట్ల రుణ సౌకర్యాన్ని నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు మరియు వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్ వంటి రుణ అవసరాలకు వినియోగించనున్నారు. దీని ద్వారా ప్రస్తుత రుణదాతలకు క్రమబద్ధమైన ఎగ్జిట్ లభించడంతో పాటు ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వం గణనీయంగా మెరుగుపడనుంది.
ఈ రుణాన్ని 20 సంవత్సరాల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల విధానంలో రూపొందించారు. అధిక వడ్డీ రుణాలను తక్కువ వ్యయంతో కూడిన దీర్ఘకాలిక రూపాయి ఫైనాన్సింగ్‌తో భర్తీ చేస్తున్నారు. ఈ లావాదేవీకి తెలంగాణ ప్రభుత్వ నిర్బంధ మరియు కచ్చితమైన చెల్లింపు హామీ, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ, ఆర్బీఐ మద్దతుతో డైరెక్ట్ డెబిట్ మాండేట్ వంటి బలమైన క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ వ్యవస్థ మద్దతుగా నిలిచాయి.
69.2 కిలోమీటర్ల పొడవుతో మూడు కారిడార్లు, 57 స్టేషన్లతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేసిన అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటి. ప్రస్తుతం ఈ నెట్వర్క్ ద్వారా రోజుకు 5 లక్షలకు పైగా ప్రయాణికులు సేవలు పొందుతున్నారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శివేంద్ర ప్రతాప్, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు,ప్రాయోజిత పధకాల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి శ్రీ అద్వైత్ కుమార్ సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) ప్రతినిధి శ్రీ కె.వి.బి. రెడ్డి, సీఎఫ్‌వో శ్రీ ఏ.వి.ఆర్. శ్రీనివాస శర్మతో పాటు ఐఆర్ఎఫ్సీ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Hyderabad,Telangana













