Last Updated:
అనంతరం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన న్యాయవాదుల వర్గాల్లో, నగరవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Hyderabad: హైదరాబాద్‌లో శనివారం ఘోరం చోటు చేసుకుంది. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలోని తన ఇంటి వద్ద కారు ఎక్కుతున్న తరుణంలో వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టిన ఘనటలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ తీవ్రంగా గాయపడి.. అనంతరం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన న్యాయవాదుల వర్గాల్లో, నగరవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల ప్రాథమిక విచారణ, స్థానికుల కథనం ప్రకారం.. న్యాయవాది ఖాజా మోయినుద్దీన్ మాసబ్ ట్యాంక్ పరిధిలో తన పని ముగించుకుని, రోడ్డు పక్కన ఆపి ఉన్న తన కారులోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు వేగంగా ప్రయాణిస్తున్న ఒక వాహనంతో ఆయనను వెనుక నుండి అత్యంత బలంగా ఢీకొట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే సదరు వాహనంతో సహా నిందితులు అక్కడి నుండి క్షణాల్లో పరారయ్యారు. వీటికి సంబంధించినవి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
తీవ్ర రక్తస్రావమై, అపస్మారక స్థితిలోకి వెళ్లిన మోయినుద్దీన్‌ను స్థానిక నివాసితులు, దారినపోయేవారు గమనించి వెంటనే స్పందించారు. ఆయన్ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి అత్యంత విషమించడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే శనివారం కన్నుమూశారు.
న్యాయవాది ఖాజా మోయినుద్దీన్ నగరంలో వక్ఫ్ బోర్డుకు చెందిన విలువైన ఆస్తులు, భూములు అక్రమంగా ల్యాండ్ మాఫియా చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కోర్టులలో నిరంతరం చట్టపరమైన పోరాటాలు చేస్తున్నారు. అనేక వివాదాస్పద భూముల కేసులలో ఆయన నేరుగా రంగంలోకి దిగి ఆక్రమణదారులకు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే ఆయనకు కొందరు భూకబ్జాదారుల నుండి ముప్పు ఉండి ఉండవచ్చని ఆయన సహచర న్యాయవాదులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోర్టులలో తమకు అడ్డొస్తున్నారనే కక్షతోనే ల్యాండ్ మాఫియా మనుషులు కావాలనే రోడ్డు ప్రమాదం సృష్టించి ఆయనను హతమార్చారని బలంగా అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని మరియు ఆ పరిసర రోడ్లపై ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను ఇంటెలిజెన్స్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఖాజా మోయినుద్దీన్‌ను ఢీకొట్టిన వాహనం నంబర్ మరియు దాని రూట్ మ్యాప్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన సాగించిన వక్ఫ్ భూముల యాక్టివిజం కోణంలోనే ఈ దాడి జరిగి ఉండవచ్చనే కోణాన్ని ప్రధానంగా బేరీజు వేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఒక సామాజిక పోరాటం చేస్తున్న న్యాయవాది ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడంపై న్యాయవాద సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.
Hyderabad,Telangana
May 23, 2026 12:44 PM IST













