Last Updated:
Hyderabad: హైదరాబాద్ శివారు ప్రాంతమైన మేడిపల్లిలో ఒళ్లు గగుర్పొడిచే భారీ దోపిడీ ఉదంతం చోటుచేసుకుంది.
ఖాకీల గస్తీ, రద్దీగా ఉండే జాతీయ రహదారిని ఏమాత్రం లెక్కచేయకుండా గుర్తుతెలియని దుండగులు బరితెగించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రముఖ ఆభరణాల దుకాణాన్ని ఎంచుకున్న దొంగలు, కనురెప్పపాటు వ్యవధిలోనే తమ పని ముగించుకుని పరారయ్యారు. కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే షట్టర్లు ధ్వంసం చేసి ఏకంగా రూ.2.5 కోట్ల విలువైన సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలను లూటీ చేసిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి పక్కనే టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ ‘క్యారెట్ లేన్’ ఆభరణాల విక్రయ కేంద్రం ఉంది. సోమవారం తెల్లవారుజామున సుమారు 4.07 గంటల సమయంలో ముఖాలకు మాస్కులు ధరించిన ఏడుగురు వ్యక్తులు ఈ దుకాణం వద్దకు వచ్చారు. నిర్మానుష్యంగా ఉన్న వాతావరణాన్ని అదనుగా చేసుకున్న ఈ ముఠా సభ్యులు, తాము దొరికిపోకుండా ఉండేందుకు ముందస్తు వ్యూహం ప్రకారం దుకాణం వెలుపల అమర్చిన సీసీ కెమెరాలను విరగ్గొట్టడంతో పాటు ప్రధాన అలారం వైర్లను కత్తిరించేశారు.
ముఠా సభ్యులు సినిమా ఫక్కీలో అత్యంత పకడ్బందీ ప్రణాళికతో క్షణాల్లో పని పూర్తి చేశారు. వెంట తెచ్చుకున్న పదునైన ఇనుప రాడ్ల సహాయంతో ప్రధాన షట్టర్ తాళాలను క్షణాల్లో బద్దలు కొట్టి పైకి లేపారు. లోపల ఉన్న గ్లాస్ డోర్‌ను పగులగొట్టి, ఏడుగురిలో ఒక యువకుడు మాత్రమే దుకాణం లోపలికి ప్రవేశించాడు. మిగిలిన ఆరుగురు సభ్యులు బయటే నిలబడి ఎవరైనా వస్తున్నారా అని పరిసరాలను గమనిస్తూ పహారా కాశారు. లోపలికి చొరబడిన ఆ వ్యక్తి ఏమాత్రం తడబడకుండా షోకేసులు, ర్యాకుల్లో ఉంచిన సుమారు రూ.2.5 కోట్ల విలువైన 580 బంగారు ఆభరణాలను వెంట తెచ్చుకున్న రెండు బ్యాగుల్లోకి వేగంగా కుక్కేశాడు. ఇందుకు అతనికి పట్టిన సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే. ఉదయం 4.18 గంటల ప్రాంతంలో ఆభరణాల బ్యాగులతో నిందితుడు బయటకు రాగానే, బయట వేచి ఉన్న ముఠా సభ్యులంతా అక్కడే సిద్ధంగా ఉంచిన ఒక ఆటో ఎక్కి జాతీయ రహదారి మీదుగా పరారయ్యారు.
దుకాణం వద్దకు చేరుకోవడం, షట్టర్లు పగులగొట్టడం, కోట్లాది రూపాయల ఆభరణాలను ఊడ్చేయడం, ఆటోలో పరారవ్వడం అంతా కలిపి సరిగ్గా 11 నిమిషాల వ్యవధిలోనే ముగిసింది.
ఉదయం 7 గంటల ప్రాంతంలో భవనం వాచ్‌మ్యాన్ వచ్చి చూడగా, జ్యువెలరీ దుకాణం షట్టర్ తెరిచి ఉండటాన్ని గమనించి ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఫ్రాంచైజీ యజమాని సుబ్రహ్మణ్యానికి సమాచారం అందించాడు. ఆయన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి పోలీసులు వెంటనే క్లూస్ టీమ్, వేలిముద్రల నిపుణులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు.
దోపిడీ జరిగిన తీరు, నిందితులు వేగంగా వ్యవహరించిన పద్ధతిని బట్టి ఇది అంతర్రాష్ట్ర ప్రొఫెషనల్ ముఠా పనేనని పోలీసులు నిర్ధారించారు. నిందితులంతా యువకులేనని, గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన బీహార్‌కు చెందిన ముఠా పనే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, ఈ దుకాణంలో మొత్తం ఏడుగురు సిబ్బంది పనిచేస్తుండగా, ఇటీవల ముగ్గురు ఉద్యోగులు అకస్మాత్తుగా పని మానేసినట్లు పోలీసులు గుర్తించారు. లోపల ఆభరణాలు ఎక్కడ భద్రపరుస్తారు, అలారం వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే అంతర్గత సమాచారాన్ని ఆ మాజీ ఉద్యోగులేమైనా దుండగులకు చేరవేశారా అనే కోణంలోనూ పోలీసులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి జాతీయ రహదారిపై ఉన్న సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తూ నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.














