Last Updated:
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంది, L&T LTMRHLలో వంద శాతం షేర్లు కొనుగోలు, 13538.53 కోట్ల అప్పు రీఫైనాన్స్ చేయనుంది
హైదరాబాద్ మెట్రోలో ఒక కీలక శకం ముగిసి, సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ఎల్ అండ్ టీ (L&T) ఆధ్వర్యంలో సాగిన మెట్రో ప్రయాణం ఇకపై పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానుంది. భాగ్యనగర ప్రజల రవాణా కష్టాలను తీరుస్తూ, రోజుకు లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న మెట్రో రైలు ఫేజ్-1ను పూర్తిస్థాయిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయం వేదికగా చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఎల్ అండ్ టీ సంస్థతో షేర్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. సుమారు రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువతో LTMRHLకు ఉన్న వంద శాతం షేర్లను ప్రభుత్వం సొంతం చేసుకుంది.
ఈ పరిణామం కేవలం యాజమాన్య మార్పిడి మాత్రమే కాదు, భవిష్యత్ మెట్రో విస్తరణకు ఒక బలమైన పునాది. ప్రస్తుతం ఉన్న 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో పాటు, ప్రతిపాదిత ఫేజ్-2 పనులను వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంది. మొత్తం వ్యవస్థ అంతా ప్రభుత్వ నియంత్రణలోకి రావడం వల్ల పనులు, ప్రణాళికలు మరియు సేవలలో మరింత సమన్వయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆర్థిక అంశాల పరంగా చూస్తే, ఎల్ అండ్ టీ హామీతో ఉన్న రూ. 13,538.53 కోట్ల అప్పును ఏప్రిల్ 30వ తేదీ నాటికి తెలంగాణ ప్రభుత్వం తన పూచీకత్తుతో రీఫైనాన్స్ చేయనుంది. ఇందుకోసం ఐడీబీఐ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించింది.
నవంబర్ 2017లో ప్రారంభమైన ఈ మెట్రో ప్రయాణం అనతి కాలంలోనే నగర జీవనరేఖగా మారింది. ఇప్పటివరకు దాదాపు 86 కోట్ల ప్రయాణాలు నమోదు కావడం మెట్రో ప్రజాదరణకు నిదర్శనం. నిత్యం 4.50 లక్షల మందిని సురక్షితంగా చేరవేస్తున్న ఈ వ్యవస్థ, ఇప్పుడు ప్రభుత్వ చేతుల్లోకి రావడంతో సామాన్యులకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది.
ఈ కీలక ఒప్పందానికి ముందే ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించారు. మొత్తానికి మెట్రో పూర్తి బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవడం వల్ల ప్రయాణికులకు మరింత మెరుగైన, నమ్మకమైన సేవలు అందడమే కాకుండా, నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.
Hyderabad,Hyderabad,Telangana













