Hyderabad: తాగింది ఒక్క బీరు.. బిల్లేమో రూ.29,844! డేటింగ్‌ యాప్‌తో వల.. పబ్‌కు పిలిచి నిలువుదోపిడీ | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Hyderabad: డేటింగ్‌ యాప్‌ల ముసుగులో అమాయక యువకులను ఆకర్షించి, పబ్‌లకు రప్పించి భారీగా బిల్లులు వేసి దోపిడీ చేస్తున్న సరికొత్త హనీట్రాప్ రాకెట్ భాగ్యనగరంలో కలకలం రేపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కేవలం ఒక్క బీరు తాగినందుకు ఏకంగా రూ.29 వేలకు పైగా బిల్లు వేసి, బౌన్సర్లతో బెదిరించి వసూలు చేసిన విస్తుపోయే ఉదంతం నగరంలోని ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్‌లో వెలుగుచూసింది. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఇటీవల ఓ డేటింగ్ యాప్‌లో ‘దివ్య’ అనే ప్రొఫైల్‌తో యువతి పరిచయమైంది. కొద్దిరోజుల పాటు వీరి మధ్య ఫోన్లలో సంభాషణలు, మెసేజ్‌లు నడిచాయి. ఈ క్రమంలో నేరుగా కలుద్దామని ఆ యువతి ఆహ్వానించడంతో, ఇద్దరూ కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని ‘36 కెమిస్ట్రీ’ పబ్‌కు వెళ్లారు. అక్కడ టేబుల్ వద్ద కూర్చున్న తర్వాత ఆ యువతి ఖరీదైన ఆల్కహాల్, రకరకాల ఆహార పదార్థాలను ఆర్డర్ చేసింది. సదరు టెక్కీ మాత్రం కేవలం ఒక్క బాటిల్ బీరు మాత్రమే తీసుకున్నాడు.

రూ.29,884 బిల్లు.. బౌన్సర్ల బెదిరింపులు!

కొద్దిసేపు గడిచాక పబ్ సిబ్బంది తీసుకొచ్చి చేతిలో పెట్టిన బిల్లు చూసి బాధితుడికి దిమ్మతిరిగిపోయింది. మొత్తం బిల్లు రూ.29,884గా అందులో నమోదు చేశారు. కేవలం ఒక్క బీరు తాగితే ఇంత బిల్లు ఎలా వస్తుందని, ఇది అన్యాయమని అతడు పబ్ సిబ్బందిని నిలదీశాడు. ఆ సమయంలోనే పథకం ప్రకారం రంగంలోకి దిగిన పబ్ బౌన్సర్లు, సిబ్బంది అతడి చుట్టూ చేరి గట్టిగా బెదిరింపులకు దిగారు. వివాదం ముదురుతుండటాన్ని గమనించిన సదరు యువతి.. తన వాటాగా రూ.18,000 ఆన్‌లైన్‌లో చెల్లించానంటూ ఫోన్ స్క్రీన్‌పై ఒక నకిలీ లావాదేవీని చూపించి, చాకచక్యంగా అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. ఆ తర్వాత మిగిలిన బిల్లును బాధితుడే పూర్తిగా చెల్లించాలని బౌన్సర్లు తీవ్ర ఒత్తిడి తెచ్చారు.

రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు

పరిస్థితి విషమించడంతో బాధితుడు రహస్యంగా జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే ఇన్‌స్పెక్టర్ డి.అశోక్, ఎస్సై కె.భవాని తమ బృందంతో కలిసి పబ్‌కు చేరుకున్నారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించిన అనంతరం, యువకులను ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చేసి అధిక బిల్లుల పేరుతో డబ్బులు లాగేందుకు పబ్ నిర్వాహకులు, ఆ యువతి కుమ్మక్కై వ్యవహరిస్తున్నట్లు నిర్ధారించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పబ్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports