Last Updated:
విద్యాసంస్థల నిర్వాహకుడు ముజాహిద్ అలంబార్ అలీయాస్ బాబా ఆదేశాల మేరకు సుపారీ ముఠా సభ్యులు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌ను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హతమార్చారు. అయితే దీనిపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Hyderabad: రాజధానిలో కోట్ల విలువైన భూవివాదాలు, కోర్టు కేసుల చుట్టూ తిరగలేక ఓ విద్యాసంస్థల నిర్వాహకుడు ప్రొఫెషనల్ న్యాయవాదిని అంతమొందించేందుకు పక్కా వ్యూహంతో సుపారీ ముఠాను రంగంలోకి దించిన ఉదంతం నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. విద్యాసంస్థల నిర్వాహకుడు ముజాహిద్ అలంబార్ అలీయాస్ బాబా ఆదేశాల మేరకు సుపారీ ముఠా సభ్యులు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌ను కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ హత్య కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు.
నిందితుడు ముజాహిద్ అలంబార్ (బాబా)కు సామాజికంగా, ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు. అయితే, ఆసిఫ్‌నగర్, మలక్‌పేట్‌లలో ఉన్న కోట్ల రూపాయల విలువైన భూవివాదాల విషయంలో న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ అతనికి కొరకరాని కొయ్యగా మారారు. 2004లో మొదలైన ఈ వివాదం 2014 నాటికి మరింత తీవ్రరూపం దాల్చింది. నిత్యం పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడం భరించలేకపోయిన ముజాహిద్, ఎలాగైనా న్యాయవాదిని హతమార్చడమే ఏకైక పరిష్కారమని భావించాడు. ఈ కుట్రకు అతని తండ్రి మహబూబ్ అలంబార్ కూడా అంగీకారం తెలపడంతో, తమ అనుచరులైన మునీర్, రావూఫ్లకు ఈ బాధ్యతను అప్పగించారు.
న్యాయవాది మొయిజుద్దీన్‌ను అంతమొందించేందుకు మొదట కుల్సుంపుర రౌడీషీటర్ దీన్దయాల్కు సుపారీ ఇచ్చారు. అతను జనవరి నెలల్లో న్యాయవాది కదలికలపై రెక్కీ నిర్వహించాడు. మొయిజుద్దీన్ ప్రతిరోజూ ఉదయాన్నే నగరంలోని ఒక స్విమ్మింగ్ పూల్‌కు ఈత కొట్టడానికి వెళ్తారని దీన్‌దయాల్ గుర్తించాడు. అయితే, ఆ సమయంలో తీవ్రమైన చలికాలం కావడం వల్ల న్యాయవాది ఈతకు వెళ్లడం తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. దీంతో ఆయన మొదటిసారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
దీన్‌దయాల్ ప్లాన్ ఫలించకపోవడంతో, ఆ స్థానంలోకి కిషన్ అనే వ్యక్తి వచ్చాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకుని అతను హత్యకు సిద్ధమయ్యాడు. అయితే, ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలనే ఉద్దేశంతో “కారుతో ఢీకొట్టి మాత్రమే చంపాలి” అని ముజాహిద్ అలంబార్ (బాబా) కచ్చితమైన ఆదేశాలు ఇచ్చాడు.
దీనికోసం డ్రైవింగ్‌లో ఆరితేరిన కవాడిగూడకు చెందిన అభిజిత్ అలీయాస్ ‘రైడర్ నాని’ని కిషన్ ఎంచుకున్నాడు. ఇందుకోసం రూ.2 లక్షలతో ఒక కారును కూడా కొనుగోలు చేశారు. గతంలో వీరు న్యాయవాదిని ఢీకొట్టేందుకు పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు ఈ నెల 20, 21, 22 తేదీల్లో శాంతినగర్‌లోని న్యాయవాది ఇంటి పరిసరాల్లో పక్కాగా రెక్కీ నిర్వహించి, ఆయన ఉదయాన్నే బయటకు వచ్చే సమయాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 23న ఉదయాన్నే మొయిజుద్దీన్ ఇల్లు దాటి కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, నిందితులు కారుతో వేగంగా వచ్చి ఆయనను బలంగా ఢీకొట్టి హతమార్చారు. అనంతరం నిందితులంతా వేర్వేరు ప్రాంతాలకు పారిపోయారు.
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్యోదంతంపై మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. హత్యలు చేసి చట్టం నుంచి సులువుగా తప్పించుకోవచ్చని భ్రమపడేవారికి ఈ నిందితుల అరెస్టే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నేరస్థులను, హంతకులను ఎవరూ రక్షించలేరని, న్యాయవాది హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు.
Hyderabad,Telangana













