Last Updated:
క్రికెట్ ప్రపంచంలో ఆధిపత్యం చలాయిస్తున్న భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డుల తీవ్ర వ్యతిరేకతతో గ్లోబల్ టీ20 టోర్నమెంట్ ఆలోచనను ఐసీసీ విరమించుకుంది. కనీసం 2031 వరకు కొత్త టోర్నీలేవీ ప్రవేశపెట్టే అవకాశం లేదని తేలిపోయింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించాలని భావించిన గ్లోబల్ ఫ్రాంచైజీ టీ20 టోర్నమెంట్ ప్రణాళికలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పాత ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) తరహాలో సరికొత్త లీగ్‌ను తీసుకురావాలన్న ఐసీసీ ఆలోచనను క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బిగ్-3 దేశాలైన భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు తీవ్రంగా వ్యతిరేకించాయి. ద్వైపాక్షిక సిరీస్‌లు, సొంత దేశాల్లో జరిగే ఐపీఎల్, బిగ్ బాష్ వంటి ప్రైవేట్ లీగ్‌లతో ఇప్పటికే షెడ్యూల్ పూర్తిగా కిక్కిరిసిపోయిందని, అదనపు టోర్నీలకు క్యాలెండర్‌లో ఏమాత్రం చోటు లేదని ఈ మూడు బోర్డులు తెగేసి చెప్పాయి. దీంతో దిగివచ్చిన ఐసీసీ, రాబోయే 2031 వరకు ఎలాంటి బహుపాక్షిక టోర్నమెంట్లను నిర్వహించబోమని స్పష్టం చేసినట్లు బ్రిటీష్ దినపత్రిక ది గార్డియన్ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ ఫ్రాంచైజీ లీగ్స్ ద్వారా వందల కోట్ల డాలర్ల ఆదాయం వస్తున్నప్పటికీ ఐసీసీకి ఒక్క రూపాయి దక్కడం లేదు. కొత్త మీడియా హక్కుల కాలంలో భారీగా ఆదాయం తగ్గే ప్రమాదం ఉండటంతో, ఫుట్‌బాల్ క్లబ్ వరల్డ్ కప్ తరహాలో సొంత ఆదాయ వనరును సృష్టించుకోవాలని ఐసీసీ భావించింది. ద్వైపాక్షిక సిరీస్‌ల మధ్యలో నాలుగు దేశాల టీ20 టోర్నీలు నిర్వహించాలని కూడా ప్రణాళికలు రచించింది.
అయితే ప్రపంచ క్రికెట్ మార్కెట్‌ను శాసిస్తున్న బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఈసీబీ బోర్డులు తమ పట్టును వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. ఐసీసీ ఒకవేళ కొత్త టోర్నీ తీసుకురావాలనుకుంటే ప్రస్తుతం ఉన్న వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రధాన ఈవెంట్లను కుదించాలని షరతు విధించాయి. దీంతో ఐసీసీ తన ప్రతిపాదనల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గక తప్పలేదు.
ఈ ప్రతిష్టంభన కారణంగా 2027 నుంచి 2031 వరకు అమలయ్యే ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) పాత షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా సాగనుంది. ఇందులో కేవలం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పరిధిని కాస్త విస్తరించడం మినహా కొత్త టోర్నీలకు తావుండదు. అంతిమంగా అంతర్జాతీయ క్రికెట్ నడవడికపై, ఆదాయ వనరులపై బిగ్-3 పట్టు మరోసారి నిరూపితమైంది.














