Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ అంటే ఏంటి?.. అర్థం తెలిస్తే మొత్తం సినిమా స్టోరీనే తెలిసిపోతుంది.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రియదర్శి-నాగదుర్గల కొత్త సినిమా టైటిల్ ‘ఇడుపు కాయితం’ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ఈ పదం అర్థం తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

News18
News18

సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఒక పదం విపరీతంగా వైరల్ అవుతోంది. అదే ‘ఇడుపు కాయితం’. ప్రముఖ నటుడు ప్రియదర్శి హీరోగా, తెలంగాణ జానపద కళాకారిణి నాగదుర్గ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్ ప్రకటించడంతో ఈ పదంపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలంగాణేతర ప్రాంతాలకు చెందిన చాలా మంది నెటిజన్లు “అసలు ఇడుపు కాయితం అంటే ఏంటి?” అని ప్రశ్నించగా, తెలంగాణ ప్రజలు మాత్రం ఇది తమ పల్లె సంస్కృతికి అద్దం పట్టే పదమని చెబుతున్నారు.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా వినిపించే ఈ పదానికి ప్రత్యేకమైన సామాజిక నేపథ్యం ఉంది. సాధారణంగా భార్యాభర్తలు కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నప్పుడు, గతంలో కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితులు లేకపోవడంతో గ్రామ పెద్దల సమక్షంలో పరస్పర అంగీకారంతో విడిపోవడానికి ఒక ఒప్పంద పత్రాన్ని రాసుకునేవారు. ఆ ఒప్పంద పత్రాన్నే స్థానికంగా ‘ఇడుపు కాయితం’ అని పిలిచేవారు. ఇక్కడ ‘ఇడుపు’ లేదా ‘ఇడుసు’ అంటే వదిలివేయడం, విడిచిపెట్టడం అనే అర్థం వస్తుంది. అందువల్ల ‘ఇడుపు కాయితం’ అంటే విడిపోతున్నామని అధికారికంగా రాసుకునే ఒప్పంద పత్రం అన్నమాట.

నేటి తరంలో చాలామందికి ఈ పదం తెలియకపోవడానికి కారణం కాలక్రమేణా గ్రామీణ ఆచారాలు, పదాలు వాడుకలో తగ్గిపోవడమేనని భాషా నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు తెలంగాణలోని అనేక గ్రామాల్లో ఈ పద్ధతి అమలులో ఉండేది. ప్రస్తుతం చట్టపరమైన విడాకుల ప్రక్రియ అందుబాటులోకి రావడంతో ‘ఇడుపు కాయితం’ అనే సంప్రదాయం దాదాపుగా కనుమరుగైపోయింది. అయితే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ పదం వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ పదం సోషల్ మీడియాలో వైరల్ కావడానికి మరో కారణం ఆంధ్రా, తెలంగాణ నెటిజన్ల మధ్య భాషా చర్చలు కూడా కావడం గమనార్హం. ఇటీవల తెలంగాణ యాస, భాషపై జరిగిన చర్చల నేపథ్యంలో ‘ఇడుపు కాయితం’ అనే పదం మళ్లీ పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. కొందరు నెటిజన్లు “ఇది అసలు తెలుగు పదమేనా?” అని ప్రశ్నిస్తే, తెలంగాణకు చెందిన మరికొందరు “ఇది అచ్చమైన తెలంగాణ పల్లె పదం, మా సంస్కృతిలో భాగం” అని సమాధానం ఇస్తున్నారు.

అంతేకాకుండా, సోషల్ మీడియాలో ఈ టైటిల్‌పై సరదా కామెంట్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. “ఈ సినిమాకు ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా?” అంటూ కొందరు సెటైర్లు వేస్తుండగా, మరికొందరు “తెలంగాణ యాస అందం ఇదే” అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇడుపు కాయితం’ అనే పదం కేవలం ఒక సినిమా టైటిల్ మాత్రమే కాకుండా, తెలంగాణ భాషా సంపద, గ్రామీణ సంస్కృతి, సామాజిక ఆచారాలపై మరోసారి చర్చకు దారితీసింది.

ఇదిలా ఉంటే, ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా దర్శకుడు దొండపాటి వంశీరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోంది. సినిమా టైటిల్ ప్రకటించగానే వచ్చిన స్పందనను చూస్తుంటే, ‘ఇడుపు కాయితం’ సినిమా విడుదలకు ముందే భారీ చర్చకు కేంద్రబిందువుగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports