Iran War: అమెరికా మరోసారి దాడి చేస్తే సైనిక స్థావరాలను పేల్చేస్తాం.. ఇరాన్ సంచలన హెచ్చరిక! | | ACTPnews

News18


Last Updated:

తమ దేశంపై అమెరికా మళ్లీ సైనిక చర్యకు దిగితే మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడతామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు టెహ్రాన్ పెట్టిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించిన వేళ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి.

News18
News18

తమ దేశంపై వాషింగ్టన్ మరోసారి సైనిక చర్యకు పాల్పడితే మధ్యప్రాచ్యం వ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, ప్రయోజనాలపై భీకర దాడులు చేస్తామని ఇరాన్ సైన్యం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి, అణు చర్చలు పునఃప్రారంభించేందుకు టెహ్రాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల ప్రణాళికపై సందిగ్ధత నెలకొన్న వేళ ఇరాన్ అత్యున్నత మిలిటరీ కమాండ్ ‘ఖతమ్ అల్-అన్బియా’ సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ఈ ప్రకటన చేసింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అమెరికా నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.

అమెరికా గనుక ఇరాన్ విషయంలో ఏదైనా తప్పు చేస్తే ఆ ప్రాంతంలోని అమెరికా బలగాల కేంద్రాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ అధికారిక మీడియా మెహర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అంతేకాకుండా అమెరికా సైనిక కార్యకలాపాలకు సహకరించే ఇతర దేశాలను సైతం యుద్ధంలో భాగస్వాములుగానే పరిగణించి దాడులు చేస్తామని ఇరాన్ మిలిటరీ కమాండ్ తేల్చిచెప్పింది.

ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధి ప్రస్తుతం ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. అమెరికా తమ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేసి, ఆర్థిక ఆంక్షలను సడలించి, కాల్పుల విరమణ పాటిస్తే కేవలం ఏడు రోజుల్లోనే హార్ముజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరిచి అణు చర్చలు ప్రారంభిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇటీవల ప్రతిపాదించారు. ఈ చర్యల వల్ల జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు సాధారణ స్థితికి వస్తాయని, ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని ఇరాన్ వాదించింది.

కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఇరాన్ తెరపైకి తెచ్చిన ఏడు రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు ప్రముఖ పత్రిక ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. నవంబర్ నెలలో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై మళ్లీ బాంబు దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ట్రంప్ తన సన్నిహిత అధికారులతో చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ ఒప్పందం కోసం ప్రయత్నిస్తోందని ట్రంప్ బహిరంగంగా చెబుతున్నప్పటికీ, అణు కార్యక్రమం విషయంలో తన షరతులకు టెహ్రాన్ తలొగ్గుతుందనే నమ్మకం ఆయనకు లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు.

దౌత్యపరమైన చర్చలు స్తంభించిపోవడం, అమెరికా మళ్లీ దాడులకు దిగవచ్చన్న వార్తల నేపథ్యంలోనే ఇరాన్ తాజా హెచ్చరికలు జారీ చేసింది. తాము కాలుదువ్వి ముందుగా యుద్ధం ప్రారంభించబోమని, కానీ తమపై దాడి జరిగితే మాత్రం ధీటుగా బదులివ్వడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని టెహ్రాన్ స్పష్టం చేసింది. దీంతో హార్ముజ్ జలసంధి భవితవ్యం, మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాల భద్రత, అణు చర్చల అంశం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports