Last Updated:
జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో శనివారం భారత్ ఖాతాలో ఏకంగా ఏడు పతకాలు చేరాయి. కబడ్డీలో రెండు స్వర్ణాలు, అథ్లెటిక్స్, షూటింగ్లో మూడు రజతాలు, రెండు కాంస్యాలతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 30కి చేరి టాప్-10లో నిలిచింది.
జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో శనివారం భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాల పంట పండించారు. ఎనిమిదో రోజు పోటీల్లో భారత్ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలను ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ క్రీడల్లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 30కి (4 స్వర్ణాలు, 12 రజతాలు, 14 కాంస్యాలు) చేరుకోగా, పతకాల పట్టికలో భారత్ తిరిగి టాప్-10లోకి దూసుకొచ్చింది. శనివారం జరిగిన పోటీల్లో భారత కబడ్డీ జట్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫైనల్ మ్యాచ్‌లలో పురుషుల జట్టు 40-34 తేడాతో, మహిళల జట్టు 37-34 తేడాతో చిరకాల ప్రత్యర్థి ఇరాన్‌ను మట్టికరిపించి బంగారు పతకాలను ముద్దాడాయి. పురుషుల కబడ్డీలో భారత్‌కు ఇది రికార్డు స్థాయిలో తొమ్మిదో స్వర్ణం కాగా, మహిళల జట్టుకు నాలుగో పసిడి పతకం కావడం విశేషం.
అథ్లెటిక్స్ పురుషుల మారథాన్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆర్మీ జవాన్ సావన్ బర్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డుతో రజత పతకం సాధించాడు. 1982 తర్వాత అంటే 44 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఆసియా క్రీడల మారథాన్‌లో భారత్‌కు పతకం అందించిన క్రీడాకారుడిగా నిలిచాడు. ఇక పురుషుల షాట్‌పుట్ ఫైనల్లో రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ 20.64 మీటర్ల దూరం గుండు విసిరి రజత పతకం కైవసం చేసుకున్నాడు. మహిళల 400 మీటర్ల పరుగులో ప్రాచీ చౌదరి 53.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కాంస్య పతకం గెలుచుకుంది.
షూటింగ్లో భారత మహిళల జట్టు మరో రజతాన్ని అందించింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ విభాగంలో తిలోత్తమ సేన్, విదర్శ వినోద్, ఆషి చౌక్సీ త్రయం 1763 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో జోష్నా చినప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్ జోడీ 1-2తో హాంకాంగ్ జంట చేతిలో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. అయితే స్క్వాష్ సింగిల్స్ విభాగాల్లో అనాహత్ సింగ్, అభయ్ సింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి స్వర్ణ పతక ఆశలను సజీవంగా ఉంచారు.
ఇతర క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు చివరి పూల్ మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్ను 2-0తో ఓడించి దర్జాగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు 21-14, 21-14తో చైనీస్ తైపీ క్రీడాకారిణిని ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరింది. ఆర్చరీ క్వాలిఫికేషన్లో ధీరజ్ బొమ్మదేవర ఆసియా క్రీడల రికార్డుతో అగ్రస్థానంలో నిలవగా, కాంపౌండ్ విభాగంలో చికిత తనిపర్తి టాప్‌లో నిలిచింది. బాక్సింగ్‌లో ప్రియా ఘంఘాస్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.














