Last Updated:
అమెరికాలోని విదేశీ ఐటీ ఉద్యోగులను ‘వెట్టిచాకిరీ బానిసలు’ అని సంబోధించిన యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ పదజాలం తీవ్ర అభ్యంతరకరమని, భారత నిపుణుల సేవలను కించపరచడమేనని విదేశాంగ శాఖ ఘాటుగా బదులిచ్చింది.
అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్కీలను ఉద్దేశించి యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. హెచ్-1బీ ఉద్యోగులను ‘వెట్టిచాకిరీ బానిసలు’ (ఇండెంచర్డ్ సర్వెంట్స్) అంటూ ఆయన సంబోధించడంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి వివాదాస్పద పదజాలం తీవ్ర అభ్యంతరకరమని, వలస పాలన నాటి బాధాకరమైన బానిసత్వాన్ని గుర్తుచేసేలా ఉందని గట్టిగా తప్పుబట్టింది.
అమెరికా ఆర్థిక ప్రగతి, ఆవిష్కరణలలో భారత నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎంఈఏ స్పష్టం చేసింది. ఉన్నత విద్య, విశేష నైపుణ్యాలు కలిగిన భారత నిపుణుల అమూల్యమైన సేవలను విస్మరిస్తూ ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని తేల్చిచెప్పింది. తరతరాలుగా వచ్చిన వలసదారుల శ్రమ, మేధస్సుతోనే అమెరికా చరిత్ర, నేటి శ్రేయస్సు నిర్మితమయ్యాయని హితవు పలికింది.
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో జేడీ వాన్స్ మాట్లాడుతూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఏడాది ఆ సంస్థ 6,000 మంది స్థానిక అమెరికన్ ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో 6,300 మంది హెచ్-1బీ వీసాదారులు, 3,000 మంది గ్రీన్‌కార్డుదారులను నియమించుకుందని ఆరోపించారు. స్థానికులను తీసేసి కంపెనీలకు పూర్తిగా లొంగి ఉండే విదేశీ వెట్టిచాకిరీ బానిసలతో భర్తీ చేశారని వ్యాఖ్యానించారు.
హెచ్-1బీ ఉద్యోగుల హోదా పూర్తిగా కంపెనీలపైనే ఆధారపడి ఉండటం వల్ల వారిని సంస్థలు ఆధీనంలో ఉంచుకుంటున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా స్థానికుల కంటే హెచ్-1బీ వర్కర్లకు 20,000 డాలర్లు, అవుట్సోర్సింగ్ సంస్థల ఉద్యోగులకు 48,000 డాలర్లు తక్కువ వేతనాలు చెల్లిస్తూ స్థానికుల వేతనాలకు గండి కొడుతున్నారని ఆయన విమర్శించారు.
ఈ వివాదాస్పద ప్రకటన వెలువడిన వెంటనే అమెరికా ప్రభుత్వం ఎనిమిది ప్రముఖ ఐటీ కంపెనీలపై కఠిన చర్యలు చేపట్టింది. విదేశీయులకు ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డుల స్పాన్సర్‌షిప్‌లో కీలకమైన ‘పర్మ్’ (లేబర్ సర్టిఫికేషన్) ప్రోగ్రామ్ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్‌లతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్, క్యాప్‌జెమినీ సంస్థలను కార్మిక శాఖ సస్పెండ్ చేసింది. ఈ వీసా విధానాన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, స్థానిక అమెరికన్ల ప్రయోజనాలను కాపాడటానికే ఈ చర్యలని అమెరికా సమర్థించుకుంది.
ఈ సస్పెన్షన్ కారణంగా ఆయా కంపెనీలు కొత్తగా ఉద్యోగులకు గ్రీన్‌కార్డు ప్రక్రియను ప్రారంభించే అవకాశం కోల్పోయాయి. నాస్కామ్ సైతం ఈ పరిణామాలపై స్పందిస్తూ వలస విధానాలు, నైపుణ్యాలు గల నిపుణుల రాకపోకలు రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేసింది. అయితే అగ్రరాజ్యంలో స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయ టెక్కీల్లో ఈ పరిణామాలు తీవ్ర ఆందోళన నింపాయి.














