Last Updated:
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న కొత్త సినిమా ‘కాకా’. తాజాగా ఈ చిత్రంలో తన పాత్ర పేరును లీక్ చేశారు మెగాస్టార్. ఆ వివరాలు చూస్తే..
సినిమా వేడుకల్లో సరదాగా మాట్లాడుతూనే తన చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన సీక్రెట్స్ రివీల్ చేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటుగా మారిపోయింది. తాజాగా ఆయన తన అప్‌కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కాకా’కు సంబంధించి అదిరిపోయే లీక్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేశారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇటీవల జరిగిన ఓ సినీ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ స్రవంతి చొక్కారపుతో చిరంజీవి సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె సొంత ఊరు ‘కదిరి’ ప్రస్తావన రాగా, ‘కాకా’ చిత్రంలో తన పాత్ర పేరు ‘కదిరి కాళిదాస్’ అని చిరు చమత్కరిస్తూ బయటపెట్టారు. మెగాస్టార్ నోటి నుంచి వచ్చిన ఈ పేరు విన్న వెంటనే ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఈ పేరు వెల్లడి కావడంతో సినిమా నేపథ్యంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ‘వాల్తేరు వీరయ్య’లో ఉత్తరాంధ్ర, విశాఖపట్నం మాస్ మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దర్శకుడు బాబీ, ఈసారి ‘కాకా’ కోసం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ మాస్ లుక్‌లో, రాయలసీమ యాసతో అలరించబోతున్నారని సమాచారం.
ఈ చిత్రంలో మలయాళ భామ అనస్వర రాజన్, టాలెంటెడ్ నటి నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ సినిమాపై హైప్‌ను పెంచేయగా, చిత్రీకరించిన రష్‌లు అద్భుతంగా వచ్చాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీ ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. సంక్రాంతి సీజన్ అంటేనే మెగాస్టార్ అడ్డాగా మారిన నేపథ్యంలో, ‘కాకా’ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.














