Last Updated:
హీరో నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ థియేటర్‌కు వెళ్లి ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని చూశారు….
హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా వీక్షించారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సినిమాను చూశారు. అనంతరం థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. సినిమా కథాంశం, తెలంగాణ నేపథ్యం, భాష, సంస్కృతి ఆవిష్కరణపై చిత్రబృందాన్ని అభినందించారు.
‘ది ప్యారడైజ్’ తెలంగాణ నేల, స్థానిక యాస, భాష, సంస్కృతిని సహజంగా తెరపై ఆవిష్కరించిన దృశ్య కావ్యంలా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అణచివేతకు గురైన సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, న్యాయం కోసం ఎలా పోరాడుతుందో సినిమాలో ప్రభావవంతంగా చూపించారని అన్నారు. ప్రజలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా ఒక నాయకుడు వారి పక్షాన నిలబడి ముందుండి నడిపించే విధానాన్ని కథలో చక్కగా ఆవిష్కరించారని తెలిపారు.
తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటాన్ని దృశ్యరూపంలోకి తీసుకొచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. హీరో నాని, మొత్తం నిర్మాణ బృందానికి కూడా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అణచివేతను ఎదుర్కొన్నప్పుడు ప్రజలు ఎలా తిరగబడతారో సినిమా చూపించిందని, తద్వారా సమాజానికి ఒక సందేశాన్ని అందించిందని ఆయన అన్నారు. చిత్రంలోని పోరాటానికి, నేపథ్యానికి ప్రేరణ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అది అందరికీ ఇప్పటికే అర్థమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు…
— KTR (@KTRBRS) September 26, 2026
సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లనున్న విషయాన్ని కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. చాలా సంవత్సరాల తర్వాత థియేటర్‌లో సినిమా చూడబోతున్నానని ఆయన తెలిపారు. తన అభిమాన నటుడు నాని, ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి రూపొందించిన ‘ది ప్యారడైజ్’ను చూడబోతున్నట్లు పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ పోస్ట్ అనంతరం సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, చారిత్రక పోరాట స్ఫూర్తి ప్రతిబింబించేలా చిత్రాన్ని రూపొందించినందుకు యూనిట్‌ను కేటీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయనతో కలిసి సినిమా వీక్షించారు. కాగా ‘ది ప్యారడైజ్’కు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, నాని ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైంది.














