PM Modi: ఆ విషయంలో మనది ‘జీరో టాలరెన్స్ పాలసీ’.. మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ | | ACTPnews

మోదీ


Last Updated:

PM Modi: భారత్ ప్రస్తుతం ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్ విధానం’ (సహించేది లేదనే ధోరణి) అవలంబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

మోదీ
మోదీ

సరిహద్దు ఆవల నుంచి సాగే ఉగ్రవాదానికి భారత్ ఇచ్చిన గట్టి సమాధానానికి 2016 సర్జికల్ స్ట్రైక్స్ ఒక ప్రబల నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 138వ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగించారు. సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ చేపట్టి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2016 సెప్టెంబరు 28-29 తేదీల్లో చేపట్టిన సర్జికల్ దాడులు ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశ దృఢ సంకల్పాన్ని ప్రపంచానికి చాటాయని అన్నారు.

పదేళ్లు పూర్తి చేసుకున్న చారిత్రక ఘట్టం

ఈ ఆపరేషన్ పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని ప్రసంగిస్తూ.. “ఈ రోజు భారత్ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తోంది. ఈ దృక్పథం వల్ల వస్తున్న సత్ఫలితాలను కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం” అని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను ఒక “గొప్ప చారిత్రక విజయం”గా ఆయన అభివర్ణించారు.

ఆనాటి సైనిక చర్యను గుర్తుచేస్తూ.. “పదేళ్ల క్రితం, సరిగ్గా 2016 సెప్టెంబరు 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు నిర్వహించింది. మన భారత జవాన్లు నియంత్రణ రేఖ (LoC) దాటి వెళ్లి ఉగ్రవాదంపై విరుచుకుపడిన తీరును చూసి ప్రపంచమంతా విస్మయానికి గురైంది. భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానానికి సంబంధించి ఈ సర్జికల్ దాడి యావత్ ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని ధైర్యంగా చూపించింది” అని ప్రధాని కొనియాడారు. దీర్ఘకాలంగా ఉగ్రదాడుల వల్ల భారత్ అనుభవించిన వేదనకు ఇది నిర్ణయాత్మక సమాధానంగా నిలిచిందన్నారు. 2016 సెప్టెంబరు 18న ఉరీలోని ఆర్మీ క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న లాంచ్‌ప్యాడ్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.

గతంలో వరుస బాంబు పేలుళ్లు సర్వసాధారణంగా ఉండేవి

భారతదేశం ఎదుర్కొన్న ఉగ్రవాద ముప్పును వివరిస్తూ గత ఘటనలను ప్రధాని ప్రస్తావించారు. “ఉగ్రవాద దాడులు సుదీర్ఘకాలం పాటు భారత్‌ను తీవ్రంగా గాయపరిచాయి. దేశంలో వరుస బాంబు పేలుళ్లు సర్వసాధారణమైన కాలం ఒకప్పుడు ఉండేది” అని అన్నారు. 2008 సెప్టెంబరు 13న ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లను, అదే ఏడాది నవంబరు 26న ముంబైపై జరిగిన దాడులను ఆయన గుర్తుచేశారు.

గతంలో ఉగ్రదాడులు జరిగిన ప్రతిసారీ పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వచ్చినప్పటికీ, వాటిపై తగిన శ్రద్ధ చూపే పరిస్థితి లేదని ప్రధాని విమర్శించారు. సమయం గడిచేవరకు వేచిచూసే ధోరణి ఆనాడు ఉండేదని, కానీ నేటి భారతదేశం ఆ విధానాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపారు. ఇప్పటి భారత్ ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని బలమైన విధానంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఉగ్రబాధితులకు ఘన నివాళి

ఇదే సమయంలో, 2001 సెప్టెంబరు 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడుల 25వ వార్షికోత్సవాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. 2014లో తాను న్యూయార్క్‌ను సందర్శించినప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద బాధితులకు నివాళులర్పించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఉగ్రవాదం వల్ల తమ ఆత్మీయులను కోల్పోయి ప్రభావితమైన భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports