Last Updated:
LSG vs RR: టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి భారీగా 220 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2026లో మరో హైస్కోరింగ్ థ్రిల్లర్‌కు జైపూర్ వేదికైంది. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్‌జీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి భారీగా 220 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు 221 పరుగుల కఠిన లక్ష్యాన్ని ఉంచింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌కు ఇది పెద్ద పరీక్షగా మారింది.
లక్నో ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోస్ ఇంగ్లిస్ సూపర్ స్టార్ట్ అందించారు. మొదటి నుంచే అటాకింగ్ మోడ్‌లో ఆడిన ఈ జోడీ.. రాజస్థాన్ బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. కేవలం 50 బంతుల్లోనే తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి మ్యాచ్‌పై ఎల్ఎస్‌జీ పట్టు బిగించారు. మార్ష్ అయితే పూర్తి స్థాయిలో విధ్వంసం సృష్టించాడు. 57 బంతుల్లో 11 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 96 పరుగులు చేసి సెంచరీకి కేవలం నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయాడు. మరోవైపు జోస్ ఇంగ్లిస్ కూడా 29 బంతుల్లో 60 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే మ్యాచ్ మోమెంటమ్‌ను లక్నో వైపు తిప్పేశాడు.
మిడిల్ ఓవర్లలో నికోలస్ పూరన్ (16), ఆయుష్ బదోని (0) పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. కెప్టెన్ రిషబ్ పంత్ చివర్లో వేగంగా ఆడాడు. 23 బంతుల్లో 35 పరుగులు చేసిన పంత్.. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో స్కోర్‌ను 220 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా జరిగిన రనౌట్లు ఎల్ఎస్‌జీకి షాక్ ఇచ్చాయి. ముందుగా సెంచరీ దిశగా దూసుకెళ్తున్న మార్ష్ రనౌట్ కాగా, వెంటనే పంత్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో మార్ష్ అద్భుత సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు.
రాజస్థాన్ బౌలర్లలో యశ్ రాజు పుంజా రెండు వికెట్లు పడగొట్టగా, జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ సాధించాడు. అయితే మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో రాజస్థాన్ ఇప్పుడు బ్యాటర్లపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనున్న రాజస్థాన్ రాయల్స్.. ఈ ఛేదన పూర్తి చేసి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Hyderabad,Telangana














