ముంబై ఇండియన్స్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా లూక్ విలియమ్స్.. అధికారిక ప్రకటన! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మహిళల జట్టు కొత్త హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లూక్ విలియమ్స్‌ను నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

News18
News18

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్ కోసం రెండు సార్ల ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. తమ మహిళల జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లూక్ విలియమ్స్‌ను ఎంపిక చేసినట్లు గురువారం అధికారికంగా వెల్లడించింది. గత సీజన్‌లో జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన లీసా కైట్లీ స్థానంలో విలియమ్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇంగ్లండ్ మహిళల జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా వెళ్లిన చార్లెట్ ఎడ్వర్డ్స్ తర్వాత లీసా కైట్లీ ముంబై పగ్గాలు చేపట్టింది.

ఆమె కేవలం ఒక్క సీజన్ మాత్రమే ఈ పదవిలో కొనసాగింది. ఇప్పుడు లీసా స్థానంలో వస్తున్న లూక్ విలియమ్స్‌కు మహిళల క్రికెట్‌లో అపారమైన కోచింగ్ అనుభవం ఉంది. 2024 డబ్ల్యూపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ముంబై ఫ్రాంచైజీ తాజా నిర్ణయంతో జట్టులో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

రికార్డులు బద్దలుకొట్టిన కోచ్

లూక్ విలియమ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌లలో కోచ్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆస్ట్రేలియాలో జరిగే ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో 2022, 2023 సీజన్లలో టైటిల్స్ సాధించాడు. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ టోర్నీలో 2023లో అసిస్టెంట్ కోచ్‌గా కప్పు గెలిచాడు. ఇండియాలో ఆర్సీబీతో 2024 డబ్ల్యూపీఎల్ టైటిల్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో మూడుసార్లు ప్రతిష్టాత్మక బ్రాడ్‌మాన్ పతకం అందుకున్న విలియమ్స్‌కు రెండు దశాబ్దాల కోచింగ్ అనుభవం ఉంది. 2025 నుంచి ఇంగ్లండ్ మహిళల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా సేవలందిస్తున్నాడు.

జట్టుకు అద్భుతమైన మార్గదర్శకత్వం

ముంబై ఇండియన్స్ లాంటి అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలో చేరడం చాలా ఆనందంగా ఉందని లూక్ విలియమ్స్ తెలిపాడు. అత్యుత్తమ టాలెంట్ ఉన్న ఆటగాళ్లతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. అద్భుతమైన క్రికెట్ ఆడి అభిమానులకు ఎన్నో మరుపురాని విజయాలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. మహిళల క్రికెట్‌ను లోతుగా అర్థం చేసుకున్న విలియమ్స్ రాకతో జట్టు మరింత బలోపేతం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో విలియమ్స్ సేవలు జట్టుకు కచ్చితంగా లాభిస్తాయని అంచనా వేస్తున్నారు.

ముంబై ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ ఈ నియామకంపై స్పందిస్తూ విలియమ్స్‌కు ఘన స్వాగతం పలికారు. విజేతగా నిలిచిన ట్రాక్ రికార్డు ఉన్న విలియమ్స్ అనుభవం ముంబై జట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. డబ్ల్యూపీఎల్‌లో తమ ఆటగాళ్లు ఇప్పటికే గొప్ప లెగసీని సృష్టించారని గుర్తుచేశారు. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ, విలియమ్స్ మార్గదర్శకత్వంలో ముంబై ఇండియన్స్ భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తుందని ఆమె ఆకాంక్షించారు. ఈ కొత్త ప్రయాణంలో జట్టు మొత్తానికి నీతా అంబానీ శుభాకాంక్షలు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports