Last Updated:
లెజెండరీ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి ఇంట పెళ్లి సందడికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ ఏడాదే ఈ ఇంటి కోడలిగా తెలుగమ్మాయి కావ్య కళ్యాణ్‌రామ్ అడుగుపెట్టనుందట.
టాలీవుడ్లో మరో క్యూట్ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ‘బలగం’ సినిమాతో హీరోయిన్గా సెన్సేషనల్ హిట్ అందుకున్న తెలుగమ్మాయి కావ్య కళ్యాణ్‌రామ్, లెజెండరీ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి పెద్ద కుమారుడు, యువ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ త్వరలోనే వివాహ బంధంతో ఒకటవుతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, తమ బంధాన్ని ఇటీవల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడంతో సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ యంగ్ కపుల్ కూడా కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.
కావ్యతో తనకున్న అనుబంధాన్ని ‘సొంత ఇంటికి చేరుకున్న అనుభూతి’గా వర్ణిస్తూ ఒక అందమైన పోస్ట్‌ను పంచుకున్నాడు కాల భైరవ. దీనికి స్పందించిన కావ్య.. కాలభైరవ తన సాధారణ రోజులను సైతం ఎంతో ప్రత్యేకంగా, అద్భుతంగా మార్చేశాడంటూ ప్రేమపూర్వకమైన రిప్లై ఇచ్చింది. ఈ అఫీషియల్ పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారడంతో ఇండస్ట్రీ ప్రముఖులు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కావ్య కళ్యాణ్‌రామ్, కాలభైరవ ఇద్దరికీ ఇండస్ట్రీతో విడదీయరాని అనుబంధం ఉంది. ‘గంగోత్రి’, ‘ఠాగూర్’, ‘బాలు’ వంటి హిట్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన కావ్య.. ఆ తర్వాత ‘మసూద’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, ‘బలగం’, ‘ఉస్తాద్’ వంటి సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మరోవైపు కాలభైరవ ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’తో పాటు ఎన్నో బ్లాక్‌బస్టర్ పాటలు పాడి సింగర్‌గా గ్లోబల్ రేంజ్లో సత్తా చాటాడు. ‘మత్తు వదలరా’, ‘కార్తికేయ 2’, ‘హనుమాన్’ వంటి పాన్-ఇండియా సక్సెస్ఫుల్ చిత్రాలకు సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
మొదట్లో ఈ ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, పిల్లల నిర్ణయాన్ని గౌరవించి పెద్దలు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. రాజమౌళి, కీరవాణి కుటుంబాలు ఈ పెళ్లికి అంగీకారం తెలపడంతో ప్రస్తుతం ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ జంట వివాహానికి ముహూర్తం ఖరారైందని, ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే వీరి కళ్యాణ వేడుక అత్యంత ఘనంగా జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వెడ్డింగ్‌ను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేస్తున్నారా? లేక డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోనున్నారా? అనే విషయాలపై త్వరలోనే స్పష్టత రానుంది. కీరవాణి ఇంట కోడలిగా అడుగుపెట్టబోతున్న కావ్యకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.














