Last Updated:
నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న ది ప్యారడైజ్ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
నేచురల్ స్టార్ నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise) కోసం యావత్ టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ, అంతకు మించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘ది ప్యారడైజ్’ రాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు పీక్స్ లోకి చేరుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు మేకర్స్ ఓ సాలిడ్ రిలీజ్ ప్లాన్ తో వస్తున్నారు.
సినిమాపై ఉన్న అమితమైన కాన్ఫిడెన్స్‌తో మేకర్స్ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌కు తెరతీశారు. సాధారణంగా రిలీజ్ కు ముందు కొన్ని పెయిడ్ ప్రీమియర్స్ వేయడం ఈ మధ్య కాలంలో చూస్తుంటాం. కానీ, ‘ది ప్యారడైజ్’ కోసం ఏకంగా సెప్టెంబర్ 23న రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 800లకు పైగా భారీ ప్రీమియర్ షోలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక టైర్-1 హీరో సినిమాకు ఈ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేయడం టాలీవుడ్ లో ఒక రికార్డు. దీన్ని బట్టి సినిమా ఔట్ పుట్ పై చిత్ర యూనిట్ ఎంత నమ్మకంతో ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజే వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఇందులో నాని మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్, పక్కా రా అండ్ మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. ముఖ్యంగా గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో ఉన్న నాని లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఇక సెప్టెంబర్ 24 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో నాని ‘జడల జమాన’ అధికారికంగా ప్రారంభం కానుంది. అభిమానులు, మాస్ ఆడియన్స్ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మరో ప్రధాన బలం ట్రెండింగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. తనదైన గూస్‌బంప్స్ తెప్పించే బిజిఎమ్ (BGM), చార్ట్ బస్టర్ సాంగ్స్ తో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అనిరుధ్ మరో స్థాయికి తీసుకెళ్లనున్నారని సమాచారం. అత్యంత భారీ వ్యయంతో, రాజీ పడకుండా నిర్మించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా, భారీ స్క్రీన్ కౌంట్‌తో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. నాని మాస్ యాక్షన్, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, అనిరుధ్ మ్యూజిక్ వెరసి ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.














