Last Updated:
లండన్ పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ప్రముఖ కంటెంట్ క్రియేటర్ ప్రియదర్శిని శక్తివేల్‌ను అనుకోకుండా కలిసి ప్రశంసించారు. మీ వీడియోలు క్రమం తప్పకుండా చూస్తానని విజయ్ చెప్పడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ లండన్ పర్యటనలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో సినీ నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసింగ్ ఈవెంట్‌కు హాజరైన సీఎం విజయ్, అక్కడ ఓ భారతీయ మహిళా యూట్యూబర్‌ను ఆప్యాయంగా పలకరించారు. ‘నేను మీ వీడియోలు క్రమం తప్పకుండా చూస్తుంటాను’ అని సీఎం స్వయంగా చెప్పడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఆ మహిళ ఎవరో కాదు, సోషల్ మీడియాలో ‘దర్శిని లండన్ డైరీస్’ పేరుతో ఎంతో గుర్తింపు పొందిన చెన్నై ఆవడికి చెందిన ప్రియదర్శిని శక్తివేల్. విదేశీ పర్యటనలో బిజీ షెడ్యూల్ నడుమ ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి స్వయంగా ఆమె వీడియోలను గుర్తుపట్టి మాట్లాడిన ఆ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఒక సాధారణ ప్రవాస భారతీయ క్రియేటర్‌కు సాక్షాత్తూ ముఖ్యమంత్రి నుంచే ప్రశంస దక్కడం అందరినీ ఆకట్టుకుంది.
చెన్నైలో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ప్రియదర్శిని ఉద్యోగరీత్యా లండన్ వెళ్లారు. కుటుంబానికి దూరంగా సరికొత్త దేశంలో జీవిస్తున్న సమయంలో అక్కడి అనుభవాలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. లండన్‌లోని ప్రసిద్ధ భారతీయ దేవాలయాలు, రెస్టారెంట్లు, సంప్రదాయ పండుగలు, అక్కడి తమిళ కుటుంబాల జీవనశైలిని తన వీడియోల ద్వారా వివరించేవారు. లండన్‌లోని ‘లిటిల్ ఇండియా’ ప్రాంతాన్ని చెన్నై ‘టి.నగర్’ తో పోలుస్తూ ఆమె రూపొందించిన వీడియోలకు విశేష ఆదరణ లభించింది. విదేశాల్లో భారతీయ సంస్కృతి ఎలా కొనసాగుతుందో చూపిస్తూ ఆమె లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.
యూట్యూబ్‌లో 11 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నప్పటికీ ప్రియదర్శిని దీన్ని వ్యాపారంగా మార్చుకోలేదు. ఇప్పటికీ ఐటీ ఉద్యోగిగానే పనిచేస్తూ, కేవలం ప్రయాణాలపై ఉన్న మక్కువతో సొంత డబ్బు ఖర్చుపెట్టి వీడియోలు రూపొందిస్తున్నారు. ఫాలోవర్ల సంఖ్య కంటే మనుషులతో ఆత్మీయ సంబంధాలు ఏర్పరచుకోవడమే తనకు ముఖ్యమని ఆమె చెబుతున్నారు. తాజాగా అజిత్ రేసింగ్ చూసేందుకు వెళ్లిన ఆమెను సీఎం విజయ్ గుర్తించి మాట్లాడటంతో ఆమె కంటెంట్‌కు మరింత గుర్తింపు లభించింది.
ముఖ్యమంత్రి స్వయంగా తన వీడియోలను ప్రస్తావిస్తారని కలలో కూడా ఊహించలేదని ప్రియదర్శిని సంతోషం వ్యక్తం చేశారు. లండన్ జీవనానికి, తమిళ సంస్కృతికి మధ్య వారధిగా నిలుస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఒక కంటెంట్ క్రియేటర్ పనితనాన్ని గుర్తించి మనస్ఫూర్తిగా అభినందించిన సీఎం విజయ్ తీరుపై నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.














