Last Updated:
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఏపీ మంత్రి నారా లోకేష్ మధ్య ‘ఎక్స్’ వేదికగా మాటల యుద్ధం నడిచింది. 2026 తర్వాత దక్షిణాది సీట్ల వర్గీకరణ, ప్రయోజనాలపై ఇరు నేతలు లెక్కలతో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.
దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మధ్య ‘ఎక్స్’ వేదికగా పెద్ద వాదోపవాదాలు నడిచాయి. నియోజకవర్గాల విభజనపై మాట్లాడే ముందు ఏపీ మంత్రి లోకేష్ లెక్కలు సరిచూసుకోవాలని చిదంబరం విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం మార్పులు చేయకుండా పునర్విభజన చేపడితే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ రాష్ట్రంలోని ఎంపీ సీట్లను 50 శాతం పెంచినా ఏపీ బలం తగ్గుతుందన్నారు.
చిదంబరం చేసిన ఈ విమర్శలకు మంత్రి నారా లోకేష్ దీటైన సమాధానం ఇచ్చారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ స్థానాల కేటాయింపును గతంలో స్తంభింపజేశారని, ఈ గడువు 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణనతో ముగుస్తుందని లోకేష్ గుర్తుచేశారు. ఈ గడువు ముగిసిన తర్వాత స్థానాల పునర్విభజన తప్పనిసరి అవుతుందని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన చూస్తే దక్షిణాది రాష్ట్రాలు తమ సాపేక్ష ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయనే ఆందోళన తమకు కూడా ఉందని తెలిపారు.
ఈ అసమతుల్యతను తొలగించేందుకే ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో డెలిమిటేషన్ బిల్లును తీసుకువచ్చిందని లోకేష్ వివరించారు. అన్ని రాష్ట్రాల సీట్లను దామాషా ప్రకారం పెంచడం ద్వారా దక్షిణాది ప్రయోజనాలను కాపాడటానికి కేంద్రం ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఇంతటి ఉన్నతమైన చట్టపరమైన అవగాహన ఉన్న చిదంబరం లాంటి నేతకు ఈ రాజ్యాంగపరమైన స్థితి తెలియంది కాదని ఎద్దేవా చేశారు. దక్షిణాది ప్రయోజనాలకు గండికొట్టేలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో ఆ బిల్లును ఎందుకు వ్యతిరేకించిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను పణంగా పెడుతోందని లోకేష్ ఆరోపించారు. ఆర్టికల్ 81 ప్రకారం 2026 జనాభా లెక్కల తర్వాత దక్షిణాది స్థానాలు తగ్గిపోతాయనేది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆ నష్టాన్ని నివారించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణను ఎందుకు అడ్డుకున్నారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. మొత్తానికి ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన ఈ మేధోపరమైన చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













