Last Updated:
NEET: కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటూ.. రెండోసారి జాగ్రత్తగా నీట్ పరీక్షను నిర్వహించగా.. విద్యార్థులు అక్రమాలు చేస్తూ దొరికిపోయారు. ఇలా 10 మంది అరెస్ట్ అయ్యారు.
ఆదివారం దేశవ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్ల నడుమ నీట్ (NEET) రీటెస్టును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించింది. ఈ పరీక్షకు దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే, ఎంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య కూడా అక్రమాలకు పాల్పడేందుకు కొందరు యత్నించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఒక అభ్యర్థి తన లోదుస్తుల్లో సిమ్ కార్డు, అలాగే నీట్ పాత ప్రశ్నపత్రాన్ని దాచిపెట్టి పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడని ఈనాడు రిపోర్ట్ చేసింది ఈ ఘటన విద్యా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
వారణాసిలోని హరిశ్చంద్ర పోస్ట్‌గ్రాడ్యుయేట్ కాలేజీలో ఏర్పాటు చేసిన సెంటర్‌కు వచ్చిన ఆ అభ్యర్థి ప్రవర్తనపై భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, లోదుస్తుల్లో దాచిన ఎలక్ట్రానిక్ పరికరాలు, పాత పేపర్ బయటపడ్డాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో తన పేరు ప్రిన్స్ దూబే అని, ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాకు చెందిన వాడినని అతడు అంగీకరించాడు. నీట్ కోసం తాను మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో ట్రైనింగ్ తీసుకున్నాననీ, కేవలం పరీక్ష రాయడం కోసమే వారణాసికి వచ్చానని పోలీసులకు తెలిపాడు. పోలీసులు అతని దగ్గర ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకుని, కేసు రాసి, దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు బీహార్‌లో కూడా నీట్ అక్రమాల్ని పోలీసులు గుర్తించారు. లఖిసరాయ్ జిల్లాలో అసలైన అభ్యర్థుల స్థానంలో (ప్రాక్సీలుగా) పరీక్ష రాసేందుకు వచ్చిన 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎస్పీ ప్రేరణ కుమార్ అధికారికంగా ధృవీకరించారు. అలాగే బయోమెట్రిక్ ఆపరేటర్లు, దళారులతో సహా మరో 10-12 మంది అనుమానితులను కూడా విచారిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా, నీట్ పేపర్ లీక్, నకిలీ ప్రశ్నపత్రాల విక్రయాలకు సంబంధించి ముజఫర్‌పూర్, పాట్నా తదితర ప్రాంతాల్లో సీబీఐ, బీహార్ పోలీసులు జరుపుతున్న ఆపరేషన్లలో కొంతమంది సైబర్ నేరగాళ్లు, దళారులను అరెస్టు చేసినట్లు ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. ఇలా వరుస అరెస్టులు జరుగుతుండటం నీట్ పరీక్ష నిర్వహణలో బయటపడుతున్న లోపాలనూ, మాఫియా నెట్వర్క్ తీవ్రతనూ చూపుతోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













