Last Updated:
Punjab: పంజాబ్‌లోని ప్రముఖ విద్యాసంస్థ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
క్యాంపస్‌లో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించిన ఓ సందేశం పెను అలజడికి దారితీసింది. ఈ వార్త తెలుసుకున్న సుమారు రెండు వేల మందికి పైగా విద్యార్థులు ఆగ్రహంతో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు.
న్యాయం చేయాలంటూ విద్యార్థినుల హాస్టల్ ఎదుట బైఠాయించిన విద్యార్థులు తొలుత నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ప్రధాన రహదారిని పూర్తిగా దిగ్బంధించి రాకపోకలను అడ్డుకున్నారు. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో కొందరు ఆందోళనకారులు క్యాంపస్‌లోకి దూసుకెళ్లి విశ్వవిద్యాలయ భవనాలపై రాళ్లు రువ్వి, అక్కడున్న ఫర్నిచర్, ఇతర విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. అంతేకాకుండా క్యాంపస్‌లోని కొన్ని భవనాలకు నిప్పుపెట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన భారీ పోలీస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను నిలువరించి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి.
ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి వివరాలను వెల్లడించారు. క్యాంపస్‌లో సామూహిక అత్యాచారం జరిగినట్లు తమకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు రాలేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే దాదాపు ఐదు రోజుల క్రితం క్యాంపస్‌లోని అగ్రికల్చర్ విభాగం సమీపంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకున్నట్లు తమకు ప్రాథమిక సమాచారం ఉందని వివరించారు. కానీ, ఆమెపై అత్యాచారం జరగడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని ఖండించారు. బాధితురాలి వివరాలు గానీ, నిందితుడి ఆనవాళ్లు గానీ ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. కొందరు ఆరోపిస్తున్నట్లు వర్సిటీ ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలను కూడా తాము ధ్రువీకరించలేదని వెల్లడించారు.
సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలను ఎల్పీయూ రిజిస్ట్రార్ డాక్టర్ మోనికా గులాటి తీవ్రంగా ఖండించారు. అవన్నీ పూర్తిగా నిరాధారమైన అవాస్తవాలని ఆమె తేల్చిచెప్పారు. విద్యార్థులను గందరగోళానికి గురిచేసి, వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రతోనే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం విద్యార్థులు, యూనివర్సిటీ యాజమాన్యంతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.














