Last Updated:
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్‌కు చెందిన అథ్లెట్ తేజస్ శిర్సే అద్భుత ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పంజాబ్ లూథియానాలోని గురునానక్ స్టేడియంలో శనివారం జరిగిన ‘ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్-9’లో పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ విభాగంలో తేజస్ తన సొంత జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.
తేజస్ శిర్సే ఈ రేసును కేవలం 13.27 సెకన్లలోనే పూర్తి చేసిన తేజస్.. గతంలో తన పేరిట ఉన్న 13.41 సెకన్ల రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. ఇదే రేసులో రిలయన్స్‌కే చెందిన మరో అథ్లెట్ క్రిషిక్ మంజునాథ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ అద్భుత టైమింగ్‌తో గ్లాస్గోలో జరగబోయే ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ (CWG) అర్హత ప్రమాణాన్ని (13.39 సెకన్లు) తేజస్ సులువుగా దాటేశాడు. కాగా, ఈ ఏడాది ఆసియా అథ్లెట్లలో పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ నమోదు చేసిన టైమింగ్ ఆరో అత్యంత వేగవంతమైనది కావడం విశేషం.
ఈ అద్భుత విజయంపై 24 ఏళ్ల తేజస్ స్పందిస్తూ.. “ఇంతకుముందు రాంచీ, తైవాన్‌లలో పోడియం సాధించినప్పటికీ.. చాలా తృప్తిలో కామన్వెల్త్ గేమ్స్ అర్హత మార్క్‌ను కోల్పోయాను. అందుకే ఈరోజు నా మైండ్‌సెట్ మార్చుకున్నా. దీన్ని ఒక ‘ఫ్రీ హిట్’ లాగా భావించాను. పర్‌ఫెక్ట్ షాట్ కోసం చూడకుండా.. బంతిని గాల్లోకి బాదడం లేదా అవుట్ అవ్వడం.. అంతే అనుకున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా, కేవలం ట్రైనింగ్ లాగే భావించి పరుగెత్తాను. నా రికవరీ, శిక్షణకు ఎంతగానో సహకరించిన రిలయన్స్ ఫౌండేషన్ టీమ్‌కు ఈ ఘనత దక్కుతుంది” అని అన్నాడు. గత ఏడాది పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించిన రెండో భారతీయుడిగా తేజస్ రికార్డు సృష్టించాడు.
రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెటిక్స్ డైరెక్టర్, కోచ్ జేమ్స్ హిలియర్ తేజస్ పట్టుదలను అభినందిస్తూ.. “తేజస్ ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. గత కొన్ని వారాలుగా అతను పడుతున్న శ్రమకు తగ్గ ఫలితం ఇది. ఈ ఏడాది ప్రారంభంలో అతనికి గాయమైనప్పటికీ.. చాలా బలంగా పునరాగమనం చేశాడు. రిలయన్స్ బృందం అతనిని మళ్లీ ఫామ్‌లోకి తీసుకురావడానికి ఎంతో శ్రమించింది. ఇదే నిలకడను అతను ఈ ఏడాది జరగబోయే ప్రధాన టోర్నమెంట్‌లలోనూ కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
రిలయన్స్ ఫౌండేషన్ అథ్లెటిక్స్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో లబ్ధి పొందిన తేజస్.. గత రెండేళ్లలో ఇండోర్, అవుట్‌డోర్ జాతీయ రికార్డులను పలుమార్లు బద్దలు కొట్టాడు. సరికొత్త జాతీయ రికార్డుతో జోరు మీదున్న తేజస్.. ఈ నెల చివర్లో భువనేశ్వర్‌లో జరగనున్న ‘ఇంటర్-స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్’లోనూ రాణించి, కామన్వెల్త్ గేమ్స్ భారత జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













