Renu Desai: నన్ను చచ్చిపో అంటున్నారు.. వారి తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇదేనా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నెగిటివీటి ఎదుర్కొంటోంది రేణు దేశాయ్. తాజాగా నన్ను చచ్చిపో అంటున్నారు అంటూ ఆమె రియాక్ట్ అయిన తీరు నెట్టింట హాట్ టాపిక్ అయింది.

News18
News18

వినాయక చవితి నవరాత్రుల ముగింపు సందర్భంగా నిర్వహించే గణేష్ నిమజ్జనం వేడుకల్లో డీజేల హోరు శృతి మించుతుండటం చూస్తూనే ఉన్నాం. మితిమీరిన శబ్ద కాలుష్యం కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పసిపిల్లలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది నిత్యం వినబడే వాదనే. ఇదే విషయంపై గళమెత్తిన నటి రేణూ దేశాయ్ తీవ్ర సైబర్ దాడులకు, ట్రోలింగ్‌కు గురయ్యారు. సమాజ హితం కోరి ఆమె చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిన కొందరు నెటిజన్లు, ఏకంగా ఆమెను ‘చచ్చిపో’ అంటూ దారుణమైన పదజాలంతో దూషించడం కలకలం రేపుతోంది. దీనిపై రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే.. నగరంలో అర్ధరాత్రి వేళల్లో మితిమీరిన డెసిబెల్స్‌తో మోగుతున్న డీజేల కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని రేణూ దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరంలో వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయని, తన కుమార్తె ఆద్యతో పాటు ఎంతోమంది అనారోగ్యంతో ఇళ్లలో చికిత్స పొందుతున్నారని ఆమె గుర్తుచేశారు. తాను 18వ అంతస్తులో పూర్తి సౌండ్ ప్రూఫ్ గదిలో ఉంటానని, తనకు డీజేల వల్ల ఎలాంటి వ్యక్తిగత ఇబ్బంది లేకపోయినా.. కింది అంతస్తుల్లో ఉండే సామాన్యుల బాధలు చూసే తాను మాట్లాడుతున్నానని ఆమె స్పష్టం చేశారు.

సాధారణంగా 85 డెసిబెల్స్ దాటిన శబ్దం నిరంతరంగా వింటే వినికిడి లోపంతో పాటు వృద్ధులకు గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈ శాస్త్రీయ వాస్తవాలను పక్కనబెట్టి పండుగ పేరుతో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

దేవుడి విగ్రహాల ముందు మద్యం సేవించి చిందులు వేయడం సనాతన ధర్మం కాదని రేణూ దేశాయ్ తేల్చి చెప్పారు. డ్యాన్సులు చేయాలనుకుంటే పబ్‌లకు వెళ్లాలని, పవిత్రమైన పూజల పేరుతో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడవద్దని హితవు పలికారు. సనాతన ధర్మం ప్రకారం నిమజ్జన కార్యక్రమాలు సూర్యాస్తమయానికి ముందే ప్రశాంతంగా పూర్తికావాలని, కానీ అర్ధరాత్రి వేళల్లో విగ్రహాలను నిర్లక్ష్యంగా నీళ్లలో విసిరేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. “అలా గంతులు వేసేవారిలో ఎంతమందికి కనీసం ఒక్క గణపతి మంత్రమైనా వచ్చా? ‘గణపతి అథర్వశీర్షం’ గురించి తెలుసా?” అని ఆమె నిలదీశారు. తాను రెండు దశాబ్దాలుగా గణపతిని నిష్టగా ఆరాధిస్తున్న గర్వించదగిన సనాతనినని ఆమె స్పష్టం చేశారు.

ఒక మహిళ సమాజ శ్రేయస్సు కోసం, అనారోగ్యంతో ఉన్న పసిపిల్లల కోసం ప్రశ్నిస్తే, బూతులు తిడుతూ, చావును కోరుకునే స్థాయికి దిగజారడం నేటి ఆధునిక విద్యావంతుల సమాజం దౌర్భాగ్యమని రేణూ దేశాయ్ మండిపడ్డారు. ఇప్పటివరకు ఎన్నో అసభ్యకరమైన కామెంట్లను భరించాను.. కానీ చదువుకున్నామని చెప్పుకునే ఈనాటి సమాజం నన్ను ముఖం మీదే చచ్చిపో అంటున్నారు. వారి తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. అయితే, రేణూ దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ మెజారిటీ నెటిజన్లు, పర్యావరణ వేత్తలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. పవిత్రమైన పండుగల పేరుతో సాగుతున్న ఈ డీజేల సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed