నకిలీ కరెన్సీ నోట్లు, ముఖ్యంగా రూ.500 నోట్ల చలామణి పట్ల నగరంలోని చిరు వ్యాపారులు, దుకాణదారులు, వీధి వ్యాపారులు, సాధారణ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని గోషామహల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. రద్దీగా ఉండే సమయాల్లో కరెన్సీ నోట్లను తీసుకునే ముందు వాటిని జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచించారు. నోట్ల భద్రతా ఫీచర్లను తనిఖీ చేయాలని, అసలైనదో కాదో అన్న అనుమానం వస్తే ఆ నోటును స్వీకరించవద్దని కోరారు. ఎవరైనా అనుమానాస్పదంగా నకిలీ కరెన్సీని చలామణి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తిస్తే, వారితో వాగ్వాదానికి దిగకుండా వెంటనే వారి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఆర్థిక నష్టం జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.














