Last Updated:
PM Modi MannKiBaat: ఉసిరికాయ గురించి మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. ఈ స్థానిక ఫలాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పౌష్టికాహార భద్రతను కూడా బలోపేతం చేయవచ్చని ప్రధాని పిలుపునిచ్చారు.
PM Modi MannKiBaat: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అనేక విలువైన అంశాలు, ప్రజలు సాధించే సక్సెస్ స్టోరీల గురించి ప్రతీ నెల చివరి ఆదివారం రేడియా కార్యక్రమం మన్ కీ బాత్‌లో చర్చిస్తూ ఉంటారు. సెప్టెంబర్ 27 ఆదివారం తాజా ఎపిసోడ్‌లో భారతీయులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన ఓ ఆయుర్వేద ఫలం గురించి చర్చించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్‌గడ్ జిల్లాను ఉసిరి సాగుతో ఉపాధి, లాభాలు పొందుతున్న ఓ ఉత్పత్తిదారుల గురించి వివరంగా తెలిపారు. భారతీయ సంప్రదాయ ఫలం ఉసిరి అంటూ చెప్పిన మోదీ ఉసిరికాయను ఒక ‘సూపర్‌ఫుడ్’గా అభివర్ణించారు. ఉసిరి రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తుందని మోదీ మన్ కీ బాత్‌లో కొనియాడారు.
ఆయుర్వేదం భారతీయ మూలాల్లో దాగివున్న దివ్యఔషద నిలయంగా చూస్తారు. అందుకే చాలా వరకు ఇప్పటి కూడా ఆయుర్వేద మూలికలు, ఫలాలను తినడానికి చాలా మంది మొగ్గు చూపుతారు. వీటిలో కేవలం ఆరోగ్య ప్రయోజనాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా ఉసిరికాయ గురించి మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. ఈ స్థానిక ఫలాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పౌష్టికాహార భద్రతను కూడా బలోపేతం చేయవచ్చని ప్రధాని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాను ప్రధాని మోదీ ఉదాహరణగా చూపించారు. ఈ ప్రాంతానికి ఉసిరితో శతాబ్దాల అనుబంధం ఉందని ప్రస్తుతం ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) పథకం కింద ఇక్కడి ఉసిరి పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.
ప్రతాప్‌గఢ్‌లో దాదాపు 100 ఉసిరి ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. వీటిలో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ ప్రశంసించారు. దేవ్‌గఢ్ కమాసీ గ్రామంలోని సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం ఉసిరితో క్యాండీ, మురబ్బా, జ్యూస్ వంటివి తయారు చేస్తోందని, వింధ్యవాసిని బృందం పచ్చళ్లు, జీర్ణశక్తిని పెంచే పొడులను ఉత్పత్తి చేస్తోందని మోదీ ఉదహరించారు.
ప్రభుత్వ సహకారంతో యంత్రాలు, రుణాలు, మార్కెట్ సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల ఈ మహిళల ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఉసిరిలో ఉండే పోషక విలువల గురించి కూడా ప్రధాని మోదీ దేశ ప్రజలకు వివరించారు. నారింజ పండుతో పోలిస్తే ఉసిరిలో అనేక రెట్లు ఎక్కువ విటమిన్ -C ఉంటుందనే విషయం శాస్త్రీయంగా నిరూపితమైందని గుర్తుచేశారు. విటమిన్-C తో పాటు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఇతర సూక్ష్మ పోషకాలు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయన్నారు మోదీ. దీనిని రోజూవారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని, చర్మం, జుట్టు ఆరోగ్యం కూడా బాగుంటుందని పేర్కొన్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలోనూ ఉసిరి సహాయపడుతుందని ప్రధాని వివరించారు.
మన ఇళ్లలో ఊరగాయలు, మురబ్బా, చ్యవన్‌ప్రాశ్ వంటి రూపాల్లో ఉసిరిని ఎప్పటినుంచో వాడుతున్నామని, ఈ సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని కోరారు. ఉసిరి వంటి స్థానిక సూపర్‌ఫుడ్‌లను ప్రోత్సహించడం ‘ఓకల్ ఫర్ లోకల్’ నినాదానికి నిజమైన స్ఫూర్తినిస్తుందని అన్నారు. తక్కువ ధరకే లభించే ఇలాంటి పోషకాహారం ద్వారా దేశంలో పోషకాహార లోపాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని, తద్వారా ఆరోగ్యవంతమైన, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించవచ్చని ప్రధాని మోదీ మన్ కీ బాత్ ద్వారా ఆకాంక్షించారు.














