Russia: రష్యాను వణికిస్తున్న అనుమానాస్పద వైరస్: 200 మంది క్వారంటైన్.. అసలేం జరిగింది? | | ACTPnews

రష్యా ల్యాబ్


Last Updated:

Russia: రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న ఒక కీలక పరిశోధనా కేంద్రంలో ప్రమాదవశాత్తు ప్రమాదకరమైన వైరస్ లేదా బ్యాక్టీరియా లీక్ అయిందన్న అనుమానాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

రష్యా ల్యాబ్
రష్యా ల్యాబ్

గుర్తుతెలియని కారణంతో వచ్చిన న్యుమోనియాతో ఒక ల్యాబ్ ఉద్యోగి మరణించడంతో రష్యన్ అధికార యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టిందని అంతర్జాతీయ వార్తా సంస్థ ‘సీఎన్‌‌ఎన్’ (CNN) నివేదించింది. రష్యన్ ప్రభుత్వ మీడియా ‘టాస్’ (TASS) కథనం ప్రకారం.. ఇర్కుట్స్క్ నగరానికి సమీపంలోని షెలెకోవ్‌లో గల ‘యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’లో ఈ ఘటన చోటుచేసుకుంది.

అసలు ఏ ఇన్ఫెక్షన్ సోకింది?

పరిశోధనా కేంద్రం నుంచి అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్ బయటకు వచ్చిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సదరు ఉద్యోగిని “అస్పష్ట కారణాలతో వచ్చిన న్యుమోనియా”తో మరణించిందని రష్యా అంటువ్యాధుల నియంత్రణ సమాఖ్య సంస్థ ‘రోస్పోట్రెబ్నాడ్జర్’ పేర్కొంది. ప్రస్తుతం ఇర్కుట్స్క్ రీజియన్‌తో పాటు షెలెకోవ్ నగరాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగ్ ఇన్‌స్టిట్యూట్ ఉద్యోగి మరణం నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

ఈ మరణం ‘న్యుమోనిక్ ప్లేగ్’ (Pneumonic Plague) కారణం కావొచ్చనే భయాలను రేకెత్తించింది. పొరుగున ఉన్న బురియాటియా గణతంత్ర అధిపతి అలెక్సీ సిడెనోవ్ మాట్లాడుతూ.. మరణించిన 28 ఏళ్ల మహిళ “ప్లేగ్ వల్ల మరణించి ఉండే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు. అయితే తమ ప్రాంతంలో ఎలాంటి ప్లేగ్ వ్యాప్తి నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, రష్యా చీఫ్ స్టేట్ డాక్టర్‌తో ప్రాంతీయ అత్యవసర కమిషన్ సమావేశం అనంతరం ఇర్కుట్స్క్ గవర్నర్ ఇగోర్ కోబ్జెవ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

క్వారంటైన్.. వైద్యుల పర్యవేక్షణ

ఈ పరిణామాల నేపథ్యంలో షెలెకోవ్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమల్లోకి తెచ్చారు. ల్యాబ్‌కు సమీపంలో ఉన్న అల్యూమినియం ప్లాంట్ తన సిబ్బంది అంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. ఉద్యోగితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని, ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి లక్షణాలు లేవని, ల్యాబ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు.

అయితే, స్థానిక స్వతంత్ర వార్తా సంస్థల నివేదికల ప్రకారం.. ఆస్పత్రిలో దాదాపు 200 మందిని పరిశీలనలో ఉంచారని, నగరంలోని కనీసం ఒక ప్రసూతి ఆస్పత్రిలో క్వారంటైన్ నిబంధనలు విధించారని సమాచారం. రోస్పోట్రెబ్నాడ్జర్ మాజీ అధిపతి గెన్నాడి ఒనిష్చెంకో మాట్లాడుతూ.. ఈ ఇన్ఫెక్షన్ ప్లేగ్ కాకపోవచ్చని, ఒకవేళ ప్లేగ్ అని తేలినా అది విస్తరించే అవకాశాలు లేవని భరోసా ఇచ్చారు.

న్యుమోనిక్ ప్లేగ్ ఎంత ప్రమాదకరం?

‘ఎర్సినియా పెస్టిస్’ (Yersinia pestis) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే మూడు రకాల ప్లేగ్ వ్యాధులలో ‘న్యుమోనిక్ ప్లేగ్’ ఒకటి. మిగిలిన రెండు రకాలు కీటకాలు లేదా జంతువుల ద్వారా సోకితే, న్యుమోనిక్ ప్లేగ్ నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. అంతేకాకుండా రోగి శ్వాసకోశ కణాల (తుంపర్ల) ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. దీని బారిన పడిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, నీరసంతో పాటు వేగంగా శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, దగ్గుతో పాటు రక్తం లేదా నీళ్ల వంటి కఫం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed