Sampoornesh Babu: సంపుర్ణేష్ బాబుపై సీనియర్ జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్స్.. స్పందించిన ‘హృదయ కాలేయం’ హీరో..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

నటుడు సంపూర్ణేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబు గురించి నాగేంద్ర కుమార్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి.

News18
News18

నటుడు సంపూర్ణేష్ బాబు, సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబు గురించి నాగేంద్ర కుమార్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ఈ వ్యవహారంపై సంపూర్ణేష్ బాబు స్పందించారు. తాను, నాగేంద్ర కుమార్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి వివరిస్తూ.. ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని అభిమానులను కోరారు.

ఇటీవల నాగేంద్ర కుమార్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబు సినీ ప్రయాణం గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు హీరోగా సినిమాల్లోకి రావడంపై నాగేంద్ర కుమార్ కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘అసలు నువ్వు ఏ యాంగిల్‌లో హీరో అవ్వాలి అనుకుని ఇండస్ట్రీలోకి వచ్చావు? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఎవరూ ఇండస్ట్రీలో లేరు కదా.. మరి నీకేంటి దురద? నిన్ను ఎవరు తీసుకుంటారు అసలు?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు స్పందించారు. ఒక నటుడిని ఇంటర్వ్యూలో ఏకవచనంతో సంబోధించడం, ఆయన సినీ ప్రయాణాన్ని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడటం సరికాదంటూ కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు సంపూర్ణేష్ బాబు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడని పేర్కొంటూ నాగేంద్ర కుమార్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో ఇంటర్వ్యూలోని ఈ భాగం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో సంపూర్ణేష్ బాబు స్వయంగా స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేసిన ఆయన.. నాగేంద్ర కుమార్ తనకు చాలా సన్నిహితమైన వ్యక్తి అని చెప్పారు. ‘అందరికీ నమస్కారం.. నేను మీ సంపూర్ణేష్ బాబు. సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ నన్ను చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అవుతోంది. నాగేంద్ర అన్న నాకు చాలా క్లోజ్. ఏదో ఫ్లోలో ఒక మాట దొర్లింది. అది కూడా మాట దొర్లింది అని నేను అనుకోను. ఎందుకంటే మా ఇద్దరి మధ్య సన్నిహిత్యం అలాంటిది’ అని తెలిపారు.

తన సినీ ప్రయాణంలో జర్నలిస్టులు అందించిన మద్దతును కూడా సంపూర్ణేష్ బాబు గుర్తుచేసుకున్నారు. చాలామంది రిపోర్టర్లు తనను సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారని చెప్పారు. ‘హృదయకాలేయం’ సినిమా నుంచి తనకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టుల్లో నాగేంద్ర కుమార్ కూడా ఒకరని పేర్కొన్నారు.

‘హృదయకాలేయం నుంచి సపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులందరితో పాటు నాగేంద్ర అన్న కూడా నాకు చాలా ఇష్టమైన, ప్రియమైన వ్యక్తి. నన్ను ఇష్టపడే వాళ్లు అందరూ దీన్ని తప్పుగా తీసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సదా మీ ప్రేమకు బానిస మీ సంపూర్ణేష్ బాబు’ అని ఆయన వీడియోలో పేర్కొన్నారు. దీంతో ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా తనదైన శైలిలో ముగించే ప్రయత్నం చేశారు.

మరోవైపు తన వ్యాఖ్యలపై నాగేంద్ర కుమార్ కూడా స్పందించారు. సంపూర్ణేష్ బాబు తనకు మొదటి నుంచి తెలుసునని, తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఇంటర్వ్యూలో కొన్ని మాటలు అలా వచ్చాయని ఆయన వివరణ ఇచ్చారు. అయితే ఆ వ్యాఖ్యలు చాలామందిని ఆగ్రహానికి గురిచేశాయని తెలుసుకున్నానని తెలిపారు.

‘సంపూర్ణేష్ బాబు నాకు మొదటి నుంచి తెలుసు. మా మధ్య ఉన్న సాన్నిహిత్యంతోనే కొన్ని మాటలు దొర్లాయి. కానీ ఆ మాటలు చాలామందిని ఆగ్రహానికి గురిచేశాయి. అందుకే ఈ సందర్భంగా సంపూతో పాటు ఆగ్రహానికి గురైనవారికి, అలాగే సంపూ అభిమానులకు కూడా క్షమాపణలు చెబుతున్నాను’ అని నాగేంద్ర కుమార్ తెలిపారు.

ఇలా ఇద్దరూ తమ తమ వైపు నుంచి వివరణ ఇవ్వడంతో సోషల్ మీడియాలో మొదలైన ఈ వివాదానికి ముగింపు పలికినట్లైంది. సంపూర్ణేష్ బాబు తనపై చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోకుండా సాన్నిహిత్యాన్ని ప్రస్తావిస్తూ స్పందించగా.. నాగేంద్ర కుమార్ కూడా తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరి స్పందనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed