Sheikh Hasina: అజ్ఞాతం వీడుతున్న షేక్ హసీనా.. ఆగస్టు 5న ప్రజల ముందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని! | | ACTPnews

News18


Last Updated:

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత తొలిసారిగా ఆగస్టు 5న మీడియాతో మాట్లాడనున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, తన భవిష్యత్ ప్రణాళికలతో పాటు స్వదేశానికి తిరిగి వెళ్లే అంశంపై ఆమె కీలక ప్రకటన చేయనున్నారు.

News18
News18

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించనున్నారు. విద్యార్థుల ఆందోళనల కారణంగా పదవి కోల్పోయి ఏడాదికి పైగా ప్రవాసంలో ఉన్న ఆమె, ఆగస్టు 5న తన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. న్యూస్18 ఇంగ్లీష్ ప్రకారం.. బంగ్లాదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఆవశ్యకతపై ఆమె సుదీర్ఘంగా మాట్లాడతారని సమాచారం. తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను కూడా ఆమె వెల్లడించే అవకాశం ఉంది.

తాను మళ్లీ స్వదేశానికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన హసీనా, ఢాకాకు తిరిగి వెళ్లే విషయంపై ఈ ప్రెస్ మీట్‌లో పూర్తి స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆమె మీడియాతో నేరుగా ఇంటరాక్ట్ కావడం ఇదే తొలిసారి. ప్రవాసంలో ఉన్న ఆమె స్వయంగా మీడియాతో మాట్లాడనుండటంతో ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

డిసెంబర్‌లో స్వదేశానికి..

హసీనా స్వదేశానికి తిరిగి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. జూన్, జూలై నెలల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలలో 2026 డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్ వెళ్లాలని ఆమె స్పష్టం చేశారు. అవామీ లీగ్ పార్టీకి రాజకీయంగా మళ్లీ స్థానం కల్పించడం, భవిష్యత్ రాజకీయాల్లో పాల్గొనడం లక్ష్యంగా ఆమె స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ వెళ్లనున్నారు. పార్టీపై విధించిన నిషేధాన్ని సవాలు చేసేందుకు సీనియర్ నేతలతో కలిసి డిసెంబర్‌లో అక్కడికి చేరుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. తనపై నమోదు చేసిన కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలే అని ఆమె కొట్టిపారేశారు. అక్కడికి వెళ్లిన తర్వాత అరెస్టుకైనా, ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని హసీనా తేల్చిచెప్పారు.

న్యాయ, రాజకీయ అడ్డంకులు

అయితే హసీనా బంగ్లాదేశ్ వెళ్లడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్ కోర్టు ఆమె లేని సమయంలోనే మరణశిక్ష విధించింది. ప్రస్తుత ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీని పూర్తిగా నిషేధించింది. ఈ పరిస్థితుల్లో ఆమె స్వదేశంలో అడుగుపెడితే తీవ్రమైన భద్రతా సమస్యలు తలెత్తుతాయి. అలాగే ప్రభుత్వంతో పెద్ద ఎత్తున న్యాయపరమైన పోరాటం చేయాల్సి ఉంటుంది.

కీలకంగా మారిన నిర్ణయం

హసీనా బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే అది ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు పెద్ద పరీక్షగా మారుతుంది. చట్టపరమైన సమస్యలు పరిష్కారం కాకముందే ఆమె దేశంలోకి ప్రవేశిస్తే, ప్రస్తుత ప్రభుత్వ చట్టబద్ధత, స్థిరత్వంపై అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ పరిణామం భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఆమె తిరిగి వెళ్లే విషయంలో భారత అధికారుల ప్రస్తావన వస్తున్నా, ఆ నిర్ణయం పూర్తిగా హసీనా ఇష్టానికే వదిలేసినట్లు న్యూఢిల్లీ స్పష్టం చేసింది. ఏడాదికి పైగా ప్రవాసంలో ఉన్న ఆమె ఆగస్టు 5న జరిగే ప్రెస్ మీట్‌లో తన భవిష్యత్ కార్యాచరణపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports