Last Updated:
Smit Machchhar: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ ప్రాణాంతక దాడికి దిగి, విమానాన్ని కూల్చేందుకు యత్నించిన భయానక క్షణాల్లో తాను ‘హనుమాన్ చాలీసా’ను పఠిస్తూ మనోధైర్యాన్ని కూడదీసుకున్నానని కెప్టెన్ స్మిత్ మచ్చార్ వెల్లడించారు.
తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత పైలట్ కెప్టెన్ స్మిత్‌తో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాల్ ద్వారా ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కెప్టెన్ ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తిని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ భారతదేశం ప్రార్థిస్తోందని భరోసా ఇచ్చారు.
ప్రధాని మోదీతో సంభాషణ సందర్భంగా కెప్టెన్ స్మిత్ మాట్లాడుతూ.. జీవితంలో ఎప్పుడు తీవ్రమైన కష్టాలు, క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తాను హనుమాన్ చాలీసా పఠిస్తుంటానని, ఫ్లైదుబాయ్ కాక్‌పిట్‌లో మరణంతో పోరాడుతున్న అత్యంత విపత్కర క్షణాల్లోనూ అదే చేశానని భావోద్వేగంతో చెప్పారు. విమానం గాల్లో ఉండగా సహ పైలట్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినప్పటికీ, తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా మొక్కవోని ధైర్యంతో స్మిత్ కాక్‌పిట్ తలుపులు తెరిపించారు. దాంతో క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు లోపలికి వచ్చి సహ పైలట్‌ను నిలువరించగలిగారు. అనంతరం ఎఫ్ జెడ్ 1073 విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను సురక్షితంగా కాపాడారు.
ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటం తనకు జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ఘట్టమని స్మిత్ ఎంతో ఉద్వేగంతో పేర్కొన్నారు. దేశ ప్రధానితో మాట్లాడే అరుదైన అవకాశం తనకు లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని, ప్రధాని మోదీయే తనకు అతిపెద్ద ఆదర్శప్రాయుడని చెప్పారు.
ఈ సందర్భంగా స్మిత్ తల్లి గీతా బెన్ గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భగవద్గీత నేర్పిన విలువలు, ఆదర్శాలతో ఆమె తన కుమారుడిని పెంచారని, ఆ సంస్కారమే నేడు స్మిత్‌ను ఇంతటి ఉన్నత వ్యక్తిగా, ధైర్యశాలిగా నిలబెట్టిందని ప్రధాని కొనియాడారు. ఇతరుల ప్రాణాలు తీసే సంస్కృతి భారతీయులది కాదని, తోటివారి ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే గొప్ప తత్వం మన రక్తంలోనే ఉందని భారతదేశం గర్వంగా చాటిచెప్పేలా స్మిత్ నిరూపించారని మోదీ ప్రశంసించారు.














