Last Updated:
అంతర్జాతీయంగా సూపర్ హిట్టై, ఇటీవల హిందీలో సైతం మొదలైన ‘ద ట్రైటర్స్’ (The Traitors) ఫ్రాంచైజీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమైంది. సస్పెన్స్, మైండ్ గేమ్ నేపథ్యంతో రాబోతున్న ఈ షో లాంచింగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
ప్రపంచవ్యాప్తంగా రియాలిటీ షోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బిగ్‌బాస్ లాంటి షోలు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ తదితర భాషల్లో దశాబ్ద కాలంగా విజయవంతంగా దూసుకుపోతున్నాయి. అయితే, ఏళ్ల తరబడి ఒకే ఫార్మాట్‌తో సాగుతున్న బిగ్‌బాస్‌కు గట్టి పోటీనిచ్చేందుకు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ రియాలిటీ షోలు పుట్టుకొస్తున్నాయి. అంతర్జాతీయంగా సూపర్ హిట్టై, ఇటీవల హిందీలో సైతం మొదలైన ‘ద ట్రైటర్స్’ (The Traitors) ఫ్రాంచైజీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమైంది. సస్పెన్స్, మైండ్ గేమ్ నేపథ్యంతో రాబోతున్న ఈ షో లాంచింగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
ఈ సరికొత్త రియాలిటీ షోకి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్, ‘హనుమాన్’ ఫేమ్ తేజా సజ్జా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. నాగార్జున, ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు మాత్రమే రియాలిటీ షోలు హోస్ట్ చేస్తున్న ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ, తేజా సజ్జా ఈ బాధ్యతలు చేపట్టడం ఆసక్తికరంగా మారింది. బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియాకు చెందిన మొత్తం 20 మంది ప్రముఖ సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఈ షో జరగనుంది. పేరుకు తగ్గట్లే ‘మోసం’, ‘నమ్మకద్రోహం’ అనే థీమ్ చుట్టూ ఈ మైండ్ గేమ్ తిరుగుతుంది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఉన్న చారిత్రక సూర్యగఢ్ ప్యాలెస్‌లో భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ షో ఫస్ట్ సీజన్ షూటింగ్‌ను పూర్తి చేశారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) వేదికగా అక్టోబరు 15 నుంచి ఈ ‘ద ట్రైటర్స్’ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. మొదటి వారం తర్వాత ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ నడుస్తున్న సమయంలోనే ఈ షో కూడా స్ట్రీమింగ్కి వస్తుండటంతో, ఈ రెండు షోల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది. బిగ్‌బాస్ తరహాలో గొడవలతో నెగిటివిటీ మూటగట్టుకుంటుందా? లేక స్వచ్ఛమైన మైండ్ గేమ్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందా అనేది చూడాలి.
మరోవైపు టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు ఓటీటీల బాట పడుతుండటం విశేషం. ఇప్పటికే బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’తో సెన్సేషన్ క్రియేట్ చేయగా, నాగార్జున బిగ్‌బాస్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ప్రముఖ ఓటీటీ కోసం భారీ టాక్ షో చేయబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. తేజా సజ్జా కూడా ఇప్పుడు డిజిటల్ రియాలిటీ షో హోస్ట్‌గా మారడంతో, తెలుగు స్టార్స్ థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి సిద్ధమయ్యారని స్పష్టమవుతోంది.














