Last Updated:
Success Story: జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో హోమ్ గార్డుల నియామక ప్రక్రియకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. దీనికి కారణం గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలు ఎటువంటి ప్రత్యేక దుస్తులు (ట్రాక్‌సూట్లు) గానీ, ప్రత్యేక సదుపాయాలు గానీ లేకుండా, ఏకంగా చీరలు కట్టుకునే 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. 8 నిమిషాల పరుగు సమయాన్ని కేవలం 7 నిమిషాల్లోనే పూర్తి చేశారు.
Success Story: జీవితం ప్రతీ ఒక్కరికి బ్రతుకు పోరాటం నేర్పిస్తుంది. అది చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్దాప్యం వరకు ఆడ, మగ అనే తేడా లేకుండా మనిషిని విజయపథంలో నడిపిస్తుంది. జార్ఖండ్ రాష్ట్రం రామ్‌గఢ్‌లోని సిధు-కన్హు జిల్లా మైదానంలో పరుగు పందాలు జరిగాయి. అయితే ట్రాక్‌సూట్‌లు లేవు, ఖరీదైన బూట్లు లేవు, పరుగు కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యే సౌకర్యాలు కూడా లేవు. అయినప్పటికీ అక్కడికి వచ్చిన వాళ్లలో కొందరు మహిళల పట్టుదల ఎంత గొప్పదంటే మహిళలు తమ చీరలను సర్దుకుంటూనే కాళ్లకు చెప్పులు కూడా లేకుండా 1,600 మీటర్ల పరుగును పూర్తి చేశారు. రామ్‌గఢ్‌లో జరిగిన హోమ్ గార్డ్ రిక్రూట్‌మెంట్ ట్రయల్స్ సమయంలో ఇద్దరు మహిళలు ప్రదర్శించిన స్ఫూర్తి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రామ్‌గఢ్ బ్లాక్‌లోని మారుమూల బుద్ధా ఖుఖ్రా గ్రామానికి చెందిన సునీతా దేవి , జగేశ్వరి కుమారి, చీరలు ధరించి మైదానంలోకి అడుగుపెట్టి, పరుగును విజయవంతంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది వినడానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే .. చూస్తే వాళ్ల ధైర్యం, పట్టుదల ముందు ఎంతటి వాళ్లైనా శభాష్ అనాల్సిందే.
రామ్‌గఢ్‌లోని సిధు-కన్హు జిల్లా మైదానంలో హోమ్ గార్డ్స్ సెలక్షన్స్‌కి సంబంధించిన ఫిజికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు బుధా ఖుఖ్రా గ్రామానికి చెందిన మహిళలు కూడా వచ్చారు. పరుగు పందెం కోసం ప్రత్యేకమైన ట్రాక్‌సూట్లు లేకపోవడంతో, వారు మైదానానికి చేరుకున్నప్పుడు ధరించి ఉన్న చీరలతోనే పరుగెత్తాలని నిర్ణయించుకున్నారు. నిబంధనల ప్రకారం 1,600 మీటర్ల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉండగా బుద్ధా ఖుఖ్రా గ్రామానికి చెందిన సునీతా దేవి , జగేశ్వరి కుమారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన చీరలతోనే రన్నింగ్ రేసులో పార్టిసిపేట్ చేశారు. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే ఆ దూరాన్ని పూర్తి చేయగలిగారు. సునీతా దేవి వయసు 36 ఏళ్లు కాగా, జలేశ్వరీ కుమారి వయసు 28 ఏళ్లు.
హోం గార్డ్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు వచ్చిన ఇద్దరు మహిళలు వ్యవసాయ పనులు చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు పరుగు (రన్నింగ్) కోసం బయలుదేరుతారు. రామ్‌గఢ్‌కు చెందిన ఈ మహిళల కథ కేవలం ఒక వైరల్ వీడియోకు మాత్రమే పరిమితం కాదు. గ్రామీణ నేపథ్యం కలిగిన వీరు వ్యవసాయం ద్వారా తమ కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు ఇప్పుడు హోమ్ గార్డ్‌లో చేరేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. తాము ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకే పరుగు పందెం సాధన కోసం ఇంటి నుండి బయలుదేరుతామని సునీత, జలేశ్వరి చెబుతున్నారు. గ్రామానికి చెందిన ఇతర మహిళలు, యువతులు కూడా హోమ్ గార్డ్ నియామక ప్రక్రియ కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే వారి ఆర్థిక పరిస్థితి కారణంగా ట్రాక్‌సూట్లు, బూట్లు లేదా ఇతర అవసరమైన పరికరాలను కొనుగోలు చేయలేకపోతున్నారు.
తమ శిక్షణకు అవసరమైన వనరులు తమ వద్ద లేవని ఆ మహిళలు చెబుతున్నారు. అయినప్పటికీ, వారు వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరు. వారికి, చీర కట్టుకుని పరుగెత్తడం ఒక హాబీ కాదు, అది అవసరం కొద్దీ ఏర్పరచుకున్న మార్గం. బుద్ధ ఖుఖ్రా గ్రామానికి చెందిన ఈ మహిళలు, తమలో కఠోర శ్రమ, ధైర్యం ఉన్నంత వరకు వనరుల కొరత ఒక సమస్య కాదని నమ్ముతారు. ఈ దృఢ విశ్వాసంతో, వారు తమ పరుగు శిక్షణ కోసం తెల్లవారుజాము చీకటిలోనే తమ ఇళ్ల నుండి బయటకు అడుగు పెడతారు.
రామ్‌గఢ్ జిల్లాలో 284 హోమ్ గార్డ్ పోస్టుల భర్తీ ప్రక్రియ అక్టోబర్ 24న ప్రారంభం కానుంది. ఈ నియామక ప్రక్రియకు సిద్ధమవుతున్న గ్రామీణ మహిళలకు, ఇది కేవలం ఉద్యోగం సాధించే అవకాశం మాత్రమే కాదు.. తమ కఠోర శ్రమ, పట్టుదలను నిరూపించుకునే ఒక గొప్ప అవకాశం కూడా. చీర కట్టుకుని 1,600 మీటర్ల పరుగులో పాల్గొంటున్న సునీతా దేవి, జలేశ్వరీ కుమారిల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వైరల్ వీడియో వెనుక అసలు కథ వేరే ఉంది. పరిమిత వనరులు ,వ్యవసాయ జీవనశైలిలోని ఒత్తిళ్ల మధ్య కూడా ప్రభుత్వ ఉద్యోగాలను కలలు కంటూ, తెల్లవారుజామున నాలుగు గంటలకే తమ సన్నద్ధతను మొదలుపెట్టే గ్రామీణ మహిళల కథ ఇది. ఖరీదైన ట్రాక్‌సూట్లు కాకుండా, పరుగుకు కావలసింది కేవలం ట్రాక్, దృఢ సంకల్పం మాత్రమేనని ఈ మహిళలు నిరూపించారు.













